CM YS Jagan : వివేకా హత్య కేసు విచారణ తుది దశకు వచ్చిందా? సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసు క్లోజ్ చేయనుందా? పాత్రధారులు, సూత్రధారులను బయటకు రానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇదో హై ప్రొఫైల్ కేసు. దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుంది. కానీ తెర వెనుక పాత్రధారులెవరు? అని తెలుసుకునే క్రమంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ప్రస్తుతానికి ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ మంజూరు వరకూ వచ్చి బ్రేక్ పడింది.
స్వయంగా హత్య చేసిన వారిలో ఐదుగురు సీబీఐ వద్దే ఉన్నారు. ప్రత్యక్ష ప్రమేయమున్న ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి లాంటి వారు దర్జాగా ఉన్నారు. దస్తగిరి అప్రూవర్ గా మారి బెయిల్ పై బయటే తిరుగుతున్నారు. మొన్న ఆ మధ్యన తనకు సెక్యూరిటీగా ఉన్న పోలీస్ అధికారుల సమక్షంలోనే సెటిల్ మెంట్ కు దిగినట్టు వార్తలు వచ్చాయి. దస్తగిరి విషయంలో సీబీఐ పై కూడా ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. కానీ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొనే వారి కంటే.. దాని వెనుక పరోక్ష ప్రమేయం ఉన్నవారిపై సీబీఐ ఫోకస్ పెంచింది. అందుకు ఎరగా దస్తగిరిని బెయిల్ మంజూరు చేయించింది.
ఇది ప్రీ ప్లాన్ మర్డర్. అందులో డౌటే లేదు. విచారణ చేస్తోంది అత్యున్నత దర్యాప్తు సంస్థ. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారు సీబీఐ ఆధీనంలో ఉన్నారు. కానీ వారిని విడిచిపెట్టి ఆ రోజు ఫోన్ డేటాలపైనే సీబీఐ ఆధారపడి విచారణ చేపడుతుండడం కొంచెం విస్తుగొల్పుతోంది. కేవలం నిందితులు ఫోన్లు ఎవరెవరికి చేశారు అన్నది దర్యాప్తులో కీలకమే అయినా.. అంతకు మించి దర్యాప్తు వనరు సీబీఐ వద్దే ఉంది. దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డిలకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయిస్తే ఇట్టే నిజాలు తెలిసిపోతాయి. వాస్తవాలు వెల్లువలా బయటకు వస్తున్నాయి. ఆ పని విడిచిపెడుతున్న సీబీఐ పొలిటికల్ కోణాలనే పట్టుకొని వెతుకుతోంది.
నాలుగేళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఈ కేసు విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ పేరు తరచూ వినిపిస్తోంది. పిటీషన్లు, అనుబంధ పిటీషన్లు, వాదనల్లో సీఎం జగన్ కు ఈ హత్య విషయం ముందే తెలుసునని సీబీఐ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలతో జగన్ కు దూరం పెరిగింది. ఏపీ వచ్చి మరీ అగ్రనేతలు జగన్ సర్కారు అవినీతిపై ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు కేసును క్లోజ్ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. జగన్ జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఏదో ఒక బాంబు పేల్చేందుకు సిద్ధపడుతుంది. పొలిటికల్ గా అది డ్యామేజయ్యే అవకాశం ఉంది. అందుకే జగన్ జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.