AP Elections 2024: 300 చోట్ల తనిఖీలు..4000 మందిపై కేసులు.. ఏపీలో హై అలర్ట్

గతంలో ఎన్నడూ లేని విధంగా మారణాయుధాలు, నాటు బాంబుల కోసం పోలీసులు వెతుకుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 13 జిల్లాల్లో సమస్యాత్మక గ్రామాలను పోలీసులు లైట్ తీసుకోవడం లేదు.

Written By: Dharma, Updated On : May 22, 2024 10:58 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఏపీలో హై అలర్ట్. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిఘా అధికమైంది. కార్డెన్ సెర్చ్ పేరిట సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా తనిఖీలు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ నాడు అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికతో పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. పోలింగ్ నాడు జరిగిన అల్లర్ల నేపథ్యంలో.. సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా మారణాయుధాలు, నాటు బాంబుల కోసం పోలీసులు వెతుకుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 13 జిల్లాల్లో సమస్యాత్మక గ్రామాలను పోలీసులు లైట్ తీసుకోవడం లేదు. అటు వాహన తనిఖీలతో పాటు అనుమానాస్పద ప్రాంతాలను సందర్శిస్తున్నారు. రౌడీ షీట్ ఉన్న ప్రతి ఒక్కరిని స్టేషన్కు రప్పించి ఆరా తీస్తున్నారు. అయితే ఈ తరుణంలో పోలీసుల వ్యవహార శైలిలో మార్పు రావడం విశేషం. ఈ విషయంలో టిడిపి తో పాటు అధికార వైసిపి నేతల పై కూడా ఒకే తరహాలో పోలీసులు ప్రవర్తిస్తున్నారు. అన్ని పార్టీల నేతలను కౌంటింగ్ కు సహకరించాలని కోరుతున్నారు.

గత మూడు రోజులుగా రాష్ట్రంలో 300 చోట్ల పోలీసులు తనిఖీలు చేశారు. పోలింగ్ నాడు అల్లర్లకు సంబంధించి నాలుగు వేల మందిపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో 15 రోజులపాటు పోలీసులకు సెలవులు ఇవ్వొద్దంటూ ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చేనెల 19 వరకు కేంద్ర బలగాలు సైతం ఏపీలో ఉండేలా ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి.. కోలుకున్న వరకు ఏపీలో ప్రత్యేక బలగాలు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగినా.. ఏపీలో మాత్రం విధ్వంసక ఘటనలకు, హింసకు దారి తీయడం ఆందోళన కలిగిస్తోంది. కౌంటింగ్ తర్వాత కూడా హింస కొనసాగుతుందని నిఘా వర్గాల హెచ్చరిక ఏపీ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.