Alluri Sitaramaraju: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు( Alluri Sitaram Raju ). దేశానికి స్వాతంత్రం సిద్ధించాలని పోరాటం చేసిన మహనీయుడు. ఆయన ప్రధాన అనుచరుడు గాం గంటం దొర( Gantam dora ). నాడు అల్లూరి చెంతనే ఉంటూ వీరోచిత పోరాటం చేశారు. వీరి పోరాటం ఆచంద్రార్కంగా నిలిచింది. కానీ గంధం దొర వారసులు మాత్రం దయనీయ పరిస్థితి అనుభవిస్తున్నారు. అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో గంటం దొర వారసుల దీనస్థితి ప్రస్తావనకు వచ్చింది. ఓ 11 కుటుంబాలు పడుతున్న బాధలను క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రపతి వారి పరిస్థితిని చూసి చలించి పోయారు. విశాఖ ఉమ్మడి జిల్లా కొయ్యూరు మండలం లంక వీధిలో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో భారీ గృహ సముదాయాన్ని నిర్మించారు. ఇందుకుగాను రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వాటిని గంటం దొర కుటుంబ సభ్యులకు అందించారు.
* స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర
అల్లూరి సీతారామరాజు ( Alluri sitaramaraju )ప్రధాన అనుచరుడిగా గంటం దొర ఉండేవారు. గిరిజన సైన్యంలో గంటం దొరదే కీలక పాత్ర. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి పోరాటం చేసేవారు. 1920లో సంప్రదాయ ఆయుధాలతో పోరాడిన నేర్పరి గంటం దొర. బ్రిటిష్ ఆర్మీతో పోరాడుతూ 1924 లో గంటం దొర మృతి చెందారు. అయితే అప్పట్లో గంటం దొరతో ఉన్న మల్లు దొరను బ్రిటిష్ వాళ్లు అరెస్టు చేసి అండమాన్ జైలుకు తరలించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఆయనను విడుదల చేశారు. 1950లో మల్లు దొర విశాఖ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా కూడా విజయం సాధించారు. మల్లు దొర ఉన్నంతవరకు గంటం దొర కుటుంబ సభ్యులకు అండగా నిలిచేవారు. కానీ ఆయన మరణానంతరం గంటం దొర కుటుంబం చాలా ఇబ్బందులు పడింది.
* చలించిపోయిన రాష్ట్రపతి
అల్లూరి జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( president Draupadi murmu ). గంటం దొర వారసుల దయనీయ పరిస్థితిని తెలుసుకొని తక్షణం ఇళ్లు కట్టించాలని ఆదేశించారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సి.ఎస్.ఆర్ నిధులు రెండు కోట్ల ఐదు లక్షలు విడుదల చేశాయి. ఈ ఇళ్ల నిర్మాణ బాధ్యతను నాగార్జున కంస్ట్రక్షన్స్ కంపెనీ తీసుకుంది. ఏడాదిన్నరలో జి ప్లస్ 2 భవనాలు రెండింటిని నిర్మించింది. అక్కడే అల్లూరి సీతారామరాజు తో పాటు గంటం దొర విగ్రహాలను ఏర్పాటు చేశారు. సిసి రోడ్లతోపాటు మౌలిక వసతులు సైతం కల్పించారు. చక్కటి ఇళ్లను అందుబాటులోకి తెచ్చారు.
* ఇళ్లు అప్పగింత
అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ( Dinesh Kumar)గంటం దొర కుటుంబ సభ్యులకు అప్పగించారు. మన్యంలో అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలన్నింటిని పర్యాటక సర్క్యూట్ చేస్తామని ప్రకటించారు. ఆ మహనీయుల దేశభక్తిని, పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలిసేలా చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గంటం దొర కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.