China Doctor Wu Tianjun
China : ఇష్టానుసారంగా తినడం వల్ల శరీర బరువు అమాంతం పెరిగిపోతుంది. దానికి తోడు రకరకాల వ్యాధులు.. అందువల్లే వైద్యులు శరీర బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అడ్డగోలుగా తినొద్దని.. దానివల్ల లేనిపోని రోగాలను కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ మనలో చాలామందికి ఆ మాటలు పట్టవు. చైనాకు చెందిన వు టియాంజన్ అనే వైద్యుడు చేసిన పని ఇప్పుడు బరువు పెరిగిన వారికి ఆశా దీపం లాగా కనిపిస్తోంది. ఎందుకంటే టియాంజన్ చైనాలో ఓ వైద్యుడు. అతని వయసు 31 సంవత్సరాలు. 2023 సంవత్సరంలో అతడు 97.5 కిలోల బరువు ఉండేవాడు. అతని బరువు తీవ్ర ఇబ్బందిగా పరిణమించింది. పైగా డాక్టర్ కావడంతో అతడి మీద అతడికే జాలి కలిగింది. దీంతో అతడు తన బరువును తగ్గించుకోవాలని భావించాడు. ఇందుకోసం కఠినమైన సాధన చేశాడు. కేవలం 42 రోజుల్లోనే 25 కిలోల బరువు తగ్గాడు. అథ్లెట్ల తరహాలోనే తన బాడీని రూపొందించుకున్నాడు.
బరువు తగ్గడంతో..
బరువు తగ్గడంతో టియాంజన్ IFBB వరల్డ్ ఫిట్ నెస్ పోటీలో పాల్గొన్నాడు. అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు.. అయితే అతడు ఏకంగా 25 కిలోల బరువు తగ్గడానికి ఎన్నో సాధనలు చేశాడు. ప్రతిరోజు రెండు గంటల పాటు వ్యాయామం చేశాడు. 6 గంటల పాటు గాఢమైన నిద్రపోయాడు. మంచి ఆహారాన్ని తీసుకున్నాడు. క్రమశిక్షణతో డైట్ అనుసరించాడు. ఫలితంగా తన బరువును క్రమంగా తగ్గించుకున్నాడు. ఇప్పుడు అతడి బరువు దాదాపు 72 కిలోల వరకు వచ్చింది. అయితే ఆ బరువును కూడా మరింత తగ్గిస్తానని.. కేవలం 50 కిలోల బరువు వరకు తన శరీరాన్ని తీసుకెళ్తానని టియాంజెన్ చెబుతున్నాడు..” బరువు అనేది పెద్ద సమస్య కాదు. కాకపోతే దానిని తగ్గించుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. డయాబెటిక్.. బీపీ వంటి సమస్యలు అధిక బరువు వల్లే వస్తాయి. అందువల్ల వాటిని మన శరీరంలోకి ఆహ్వానించకూడదు అనుకుంటే కచ్చితంగా బరువు తగ్గాలి. బరువుపై నియంత్రణ ఉండాలి. దానికి తగ్గట్టుగా శరీరానికి శ్రమ ఉండాలి. అప్పుడే శరీరం బాగుంటుంది. వ్యాధులకు దూరంగా ఉంటుందని” టియాంజెన్ చెబుతున్నాడు. టియాంజెన్ గతంలో బాగా తినేవాడు. మాంసాహారాన్ని విపరీతంగా లాగించేవాడు. ఇదే క్రమంలో భారీగా బరువు పెరిగాడు. అయితే అతడి శరీరాన్ని చూసి చాలా మంది నవ్వేవారట. అందువల్లే టియాంజెన్ బరువు తగ్గాలని నిర్ణయించుకొని.. ఈ ప్రయత్నాలు చేశాడట.