Homeఆంధ్రప్రదేశ్‌Leaders into obscurity : విశాఖలో వైసీపీ నేతల గుప్ చుప్.. అధికారం వెలగబెట్టిన వారు...

Leaders into obscurity : విశాఖలో వైసీపీ నేతల గుప్ చుప్.. అధికారం వెలగబెట్టిన వారు అజ్ఞాతంలోకి.. క్యాడర్ పక్క చూపులు!

Leaders into obscurity : ఏపీలో విశాఖ జిల్లా కీలకం. అందుకే అక్కడ నుంచి పాలన సాగించాలనుకున్నారు జగన్. పాలనా రాజధానిగా ప్రకటించారు కూడా. ఆ జిల్లాలో ఎలాగైనా పట్టు సాధించాలని భావించారు. కానీ విశాఖ నగరం వైసీపీకి చిక్కలేదు. అయితే గత ఐదేళ్లుగా అధికారం వెలగబెట్టిన వారు, చక్రం తిప్పిన నేతలు.. ఇప్పుడు భూతద్దంలో పెట్టి వెతికినా కనిపించడం లేదు. క్యాడర్ ను కలిసేందుకు ఇష్టపడడం లేదు. అసలు ఆ నేతలు జిల్లాలో ఉన్నారా? లేదా? అన్నట్టు పరిస్థితి మారింది. విశాఖ జిల్లాకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పదవులు కేటాయించారు జగన్. కానీ అసెంబ్లీ ఎన్నికల తరువాత పదవులు అనుభవించిన నేతలు బయటకు రాకపోవడం విశేషం.
* ఓటమిపై సమీక్ష లేదు
ఎన్నికల ఫలితాలు వచ్చి 45 రోజులు అవుతుంది. తమ ఓటమికి కారణాలేంటనే కనీస సమీక్ష కూడా చేయడం లేదు వైసీపీ నేతలు. ముఖ్యంగా మంత్రి పదవులను అనుభవించిన వారు ఎక్కడా కనిపించడం లేదు. ఇది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. విశాఖ జిల్లాలో వైసీపీకి ఎందరో నాయకులు ఉన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని ఎంతో హడావిడి చేసింది. స్థానిక నేతలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్దపీట వేసింది. అవంతి శ్రీనివాసరావు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ లకు జిల్లా నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం దక్కింది. బూడి ముత్యాల నాయుడు కు డిప్యూటీ సీఎం హోదా కూడా కల్పించారు. అయితే ఇందులో గుడివాడ అమర్నాథ్ తప్ప ఆ ఇద్దరూ కనిపించడం లేదు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రుషికొండ ప్యాలెస్ పై తెగ హడావిడి నడిచింది. అయితే అప్పట్లో కేవలం గుడివాడ అమర్నాథ్ మాత్రమే మాట్లాడారు. మిగతా వారు ఎవరు కనీసం స్పందించలేదు. పార్టీ అధికారంలో ఉండగా అధికారం అనుభవించిన నేతలు.. ఓటమి తర్వాత మాత్రం సైలెంట్ అయ్యారు.
* ఇప్పటికీ వైసిపికి ఆరుగురు ప్రజాప్రతినిధులు
రాష్ట్రంలో చాలావరకు జిల్లాల్లో టిడిపి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. విశాఖ ఉమ్మడి జిల్లాలో మాత్రం రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటును ఇచ్చారు జిల్లా ప్రజలు. మరోవైపు గొల్ల బాబురావు రూపంలో రాజ్యసభ సభ్యుడు, మరో ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా వైసీపీ తరఫున ఉన్నారు. వైసీపీకి ఏకంగా ఆరుగురు ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ మీరెవరు పార్టీ విధానాలపై స్పందించడం లేదు. అధికార పార్టీ పై విమర్శలు చేయడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ, అనకాపల్లిలో నిర్మించిన వైసీపీ జిల్లా కార్యాలయాలకు ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. కానీ ఒక్క మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రమే దీనిపై స్పందించారు. మిగతా నేతలు గుప్ చుప్ అయ్యారు.
* క్యాబినెట్లో కీలక భాగస్వామ్యం
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ క్యాబినెట్ లోకి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ రావును తీసుకున్నారు. విస్తరణలో అవంతి శ్రీనివాసరావును తప్పించి గుడివాడ అమర్నాథ్ కు ఛాన్స్ ఇచ్చారు. విశాఖ రూరల్ నుంచి మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు కు మంత్రి పదవి కేటాయించారు. డిప్యూటీ సీఎం హోదాను కట్టబెట్టారు. వీరితో పాటు చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎలమంచిలి ఎమ్మెల్యే రమణ మూర్తి రాజు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చాలా దూకుడుగా ఉండేవారు. ఆయా నియోజకవర్గాల్లో సర్వం తామే అన్నట్లు వ్యవహరించేవారు. కానీ పార్టీ ఓడిపోయాక వీరెవరు క్యాడర్ను పట్టించుకోవడం లేదు.
* పార్టీని వీడుతున్న క్యాడర్
విశాఖ జిల్లాలో ఒక్కరంటే ఒక్క నేత కూడా యాక్టివ్ గా లేరు. అందుకే దిగువ స్థాయి కేడర్ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతోంది. విశాఖ నగర కార్పొరేటర్లు పార్టీ మారడానికి నేతల వైఖరి కారణం. కనీసం తమను పట్టించుకునే నాయకుడు లేకపోవడంతో ఎక్కువ మంది పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చాలామంది కార్పొరేటర్లకు ప్రత్యేకంగా బుజ్జగించారు. కానీ వారు ఎవరు వెనక్కి తగ్గలేదు. పార్టీ మారితేనే భవిష్యత్తు అని డిసైడ్ అయ్యారు. ఇప్పటివరకు పదవులు వెలగబెట్టిన నేతలు ఎవరు బయటకు కనిపించడం లేదు. కనీసం పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదు. పార్టీ శ్రేణులకు అండగా ఉండే నేతలు లేకపోవడంతో క్యాడర్ సైతం పునరాలోచనలో పడింది. పెద్ద ఎత్తున పార్టీని వీడుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular