Mega Brother Nagababu : తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానిది ప్రత్యేక స్థానం. మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి వచ్చిన మెగా హీరోలు సైతం సత్తా చాటుతున్నారు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఆ కుటుంబానికి ఒక లోటు ఉండేది. రాజకీయంగా రాణించాలని భావించింది ఆ కుటుంబం.కానీ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ రూపంలో చుక్కెదురు అయ్యింది. కానీ ఈ ఎన్నికల్లో జనసేన శత శాతం విజయంతో ఖుషి గా ఉంది మెగా కుటుంబం. అయితే తాజాగా మరో శుభవార్త అందుకుంది. మెగా బ్రదర్ నాగబాబు కు రాజ్యసభ పదవి వస్తుందని తెలిసి కుటుంబంతో పాటు అభిమానులు సంతోషపడుతున్నారు. కొద్ది రోజుల్లో నాగబాబును కేంద్రమంత్రిగా చూడబోతున్నాం అన్న వార్త వైరల్ గా మారింది. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు పదవులకు రాజీనామా చేశారు. వైసీపీకి గుడ్ బై చెప్పారు.అయితే ఈ రెండు రాజ్యసభ సీట్లు టిడిపి ఖాతాలోకి వెళ్తాయనిప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా రాజ్యసభ పదవికి ఆర్ కృష్ణయ్య కూడా దూరమయ్యారు.పదవికి రాజీనామా చేశారు. ఇలా ఖాళీ అయిన మూడో సీటు జనసేనకు ఖాయమని తెలుస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు పేరు వినిపిస్తోంది.
* పార్టీ విజయంలో కీలకం
2019 ఎన్నికల్లో జనసేన తరపున నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు నాగబాబు. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. అయితే పొత్తులో భాగంగా ఈ సీటును బిజెపికి కేటాయించారు. దీంతో నాగబాబు సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. అయినా సరే జనసేన తో పాటు కూటమి గెలుపునకు కృషి చేశారు నాగబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ పోస్టును నాగబాబుకి ఇస్తారని ప్రచారం సాగింది. కానీ నాగబాబు అంత సుముఖత వ్యక్తం చేయలేదు. రాజ్యసభ పదవి పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే అది కేంద్రమంత్రి పదవి కోసమేనని తాజాగా తెలుస్తోంది.
* జనసేనకు ఒక మంత్రి పదవి?
ఎన్డీఏలో ఏపీ నుంచి టిడిపి తో పాటు జనసేన ఉన్నాయి. టిడిపి 16 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. జనసేన రెండు సీట్లలో గెలిచింది.అయితే టిడిపికి కేంద్రంలో రెండు మంత్రి పదవులు లభించాయి. కానీ జనసేనకు మాత్రం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. విస్తరణలో ఛాన్స్ ఇస్తామని బిజెపి హై కమాండ్ చెప్పినట్లు టాక్ నడిచింది. అయితే ఆ మంత్రి పదవి నాగబాబు కోసమేనని తాజాగా తెలుస్తోంది. రాజ్యసభకు నాగబాబు ఎంపిక అయితే.. విస్తరణలో బిజెపి కేంద్రమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
* ముగ్గురు అన్నదమ్ములకు
ఒకవేళ నాగబాబుకు కేంద్రమంత్రి పదవి లభిస్తే జనసేన అభిమానులు, మెగా ఫ్యాన్స్ ఖుషి అవ్వక తప్పదు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించి.. కేంద్ర మంత్రి పదవి చేపట్టారు చిరంజీవి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తో పాటు నాలుగు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మరో బ్రదర్ నాగబాబు కేంద్ర మంత్రి అయితే.. ఆ కుటుంబం ఆశించింది తప్పక జరుగుతుంది. మెగా కుటుంబానికి ఉన్న అసంతృప్తి తొలగుతుంది.