Chandrababu: మరో 45 రోజుల్లో అమరావతికి కొత్త శోభ.. చంద్రబాబు స్కెచ్ ఏంటంటే?

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014లో అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించారు. ప్రభుత్వ భూమితో కలుపుకొని.. సుమారు 53 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించారు.

Written By: Dharma, Updated On : July 7, 2024 1:31 pm

Chandrababu

Follow us on

Chandrababu: అమరావతి: అమరావతిలో కొత్త శోభ నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త శోభ సంతరించుకుంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యమైంది. కనీస నిర్వహణ లేక అమరావతి అడవిగా మారింది. చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలతో ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణాలు కూడా కనిపించడం మానేశాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాటన్నింటినీ తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. చిట్టడ విని తలపిస్తున్న రాజధాని అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు ప్రారంభించింది. రాజధాని వ్యాప్తంగా కంపచెట్ల తొలగింపునకు సిఆర్డిఏ సిద్ధం కాగా.. ఈ పనులకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది.

* ఐదేళ్ల పాటు కొనసాగిన నిర్లక్ష్యం..
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014లో అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించారు. ప్రభుత్వ భూమితో కలుపుకొని.. సుమారు 53 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో భూములు ఇచ్చిన రైతులకు సి ఆర్ డి ఏ రిటర్నబుల్ ప్లాట్ లను ఇచ్చింది. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో.. అవి పూర్తయిన తర్వాత రిటర్నబుల్ ప్లాట్ లలో నిర్మాణాలు చేపట్టాలని రైతులు భావించారు. కానీ ఇంతలో రాష్ట్రంలో అధికారం మారడం, మూడు రాజధానులు తెరపైకి రావడం శరవేగంగా జరిగిపోయింది. అప్పటినుంచి అమరావతి రాజధానికి శాపంగా మారింది. నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు మార్కింగ్ ఇవ్వకుండానే.. అలానే ఉండిపోయాయి. అప్పటినుంచి ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలతో అమరావతి రాజధాని ప్రాంతం చిట్టడివిగా మారిపోయింది. అందుకే వైసీపీ మంత్రులు కొందరు అమరావతి రాజధానిని స్మశానంతో పోల్చారు.

* కొలువు తీరకముందే జంగిల్ క్లియరెన్స్..
ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి ఊపిరి పీల్చుకుంది. ప్రభుత్వం కొలువు తీరకముందే జూన్ లోనే ఐదు రోజుల పాటు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. 25 ప్రాంతాల్లో తాత్కాలికంగా ముళ్ళ కంపలను తొలగించి శుభ్రం చేశారు. 19 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో ఈ పనులు చేశారు. కరకట్ట రోడ్డు, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల నివాస సముదాయాల భవనాలకు వెళ్లే మార్గాలను శుభ్రం చేశారు. తాజాగా మంత్రి నారాయణ ఆదేశాలతో అమరావతి రూపురేఖలు మార్చేందుకు రూ. 36.50 కోట్లతో పనులు చేపట్టాలని సిఆర్డిఏ అంచనాలు సిద్ధం చేసింది.

నెల రోజుల్లో రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో పరిశుభ్రత పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు సంబంధించి వారం రోజుల్లో టెండర్లు ఖరారు చేయనున్నారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని గడువు విధించనున్నారు.ముఖ్యంగా అమరావతి రైతులు త్యాగం చేసిన భూములకు బదులు.. రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే గత వైసిపి ప్రభుత్వంలో ఈ రిటర్నింగ్ ప్లాట్ లకు సంబంధించి.. మార్కింగ్ చేసి చూపించాలని రైతులు ఎన్నోసార్లు కోరారు. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.ఇప్పుడు ఆ గ్రామాలను శుభ్రం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. మరో నెల 15 రోజుల్లో అమరావతి కొంగొత్త శోభలతో కనిపించడం ఖాయం.