AP Rain Alert: ఏపీ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు శుభకార్యాలు జరుగుతుండడంతో.. హాజరవుతున్న వారు ఎండతో అసౌకర్యానికి గురవుతున్నారు. ఇటువంటి సమయంలో ఏపీ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈరోజు నుంచి రేపటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. అయితే అదే సమయంలో ఎండల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని హెచ్చరించింది. గత రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. 44 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి భానుడు మండిపోతున్నాడు. మధ్యాహ్నం కి విశ్వరూపం చూపిస్తున్నాడు. సాయంత్రం 6 గంటలు దాటితే కానీ ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. రాత్రి పది గంటలు దాటిన తర్వాత కానీ చల్లటి వాతావరణం కనిపించడం లేదు. ఈ తరుణంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేయడం ప్రజలకు ఉపశమనం కలిగించే విషయం.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆదివారం వేకువ జామున తేలికపాటి వర్షాలు కురిశాయి. చల్లని వాతావరణం నెలకొంది. మరోవైపు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణీలు, వృద్ధులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శరీరం డిహైడ్రేటుకు గురికాకుండా ఓ ఆర్ ఎస్ తీసుకోవాలని చెబుతున్నారు. గ్లూకోజ్ తో పాటు కొబ్బరి నీరు, మజ్జిగ తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం వివాహాలతో పాటు అన్ని రకాల శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈనెల 20 వరకు ఇవి కొనసాగనున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. మరోవైపు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని.. ఒకవేళ వచ్చినా గొడుగు కచ్చితంగా ఉండాలని.. దాహం వేయకపోయినా తరచూ మంచినీరు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొద్దిరోజులు ఈ తరహా వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని.. అప్పటివరకు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అయితే వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే మే,జూన్ లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇంతలో అకాల వర్షాలు పలకరిస్తుండటంతో కొంత సేద తీరుతున్నారు.