
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్నారో సినీకవి. మానవసంబంధాలు మంటగలిసి పోతున్నాయి. క్షణికావేశంలో సొంత అన్ననే మట్టుబెట్టిన సంఘటన సంచలనం సృష్టించింది. అన్న దారి తప్పాడని భావించిన తమ్ముడు అన్నను తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా అన్నలో మార్పు రాకపోవడంతో రగిలిపోయాడు. కుటుంబం పరువు తీయొద్దని వేడుకున్నాడు. ఈ నేపథ్యంలో కోపం పట్టలేక అన్నను తోసేయడంతో కింద పడి పోయిన అన్న ప్రాణాలొదిలాడు. దీంతో కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. కుటుంబంలో పెద్ద కొడుకు కనరాని లోకాలకు చిన్న కొడుకు జైలు పాలు కావడంతో దుఖసాగరంలో మునిగిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం శంకరాపురం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య, నాగార్జున ఇద్దరు అన్నదమ్ములు. సోదరులంటే ఇలా ఉండాలని అందరు అనుకునే వారు. అలా సాన్నిహిత్యంగా మెలిగేవారు. అన్నకు కష్టం వస్తే తమ్ముడు తమ్ముడికి కష్టం వస్తే అన్న సాయం అందించేవారు. దీంతో ఊళ్లో కూడా వీరంటే ప్రత్యేక అభిమానం ఉండేది. కొన్నాళ్లు వీరి మధ్య సఖ్యత అలాగే కొనసాగింది. వీరి మధ్య ఎవరు దూరినా వారికి చెంప చెల్లుమనేది.
కానీ ఇటీవల వారి మధ్య అగాధం పెరిగింది. దీనికి కారణం అన్న గ్రామానికి చెందిన ఓ వివాహితతో గత కొంత కాలంగా చనువుగా ఉంటున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు దీంతో ఊరంతా హేళనగా మాట్లాడేవారు. దీనికి తమ్ముడు రగిలిపోయేవాడు. తీరు మార్చుకోవాలని అన్నకు ఎన్నోసార్లు చెప్పాడు. అయినా అన్నలో మార్పు లేదు. ఈ నేపథ్యంలో తమ్ముడికి విసుగొచ్చింది.
దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగింది. ఘర్షణ చోటుచేసుకుంది. అన్నదమ్ములిద్దరు ఒకరికొకరు తోసుకున్నారు. ఈ తోపులాటలో వెంకటసుబ్బయ్యను నాగార్జున గట్టిగా నెట్టాడు . దీంతో అన్న కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వెంకటసుబ్బయ్య భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.