ABN Andhrajyothi : అనుకూలంగా వస్తే ఒకలా… వ్యతిరేకంగా వస్తే మరోలా.. ఏబీఎన్ పచ్చాభిమానానికి విరుగుడేదీ?

ష్టానుసారంగా న్యాయవ్యవస్థకు రకరకాల అపప్రదలు ఆపాదించడం సరైనది కాదు. రేపటి నాడు జగన్ స్థానంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే... కోర్టు ఇదే తీరుగా తీర్పు ఇస్తే అప్పుడు ఏబీఎన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో మరీ?!

Written By: NARESH, Updated On : May 28, 2023 3:54 pm
Follow us on

ABN Andhrajyothi : వ్యవస్థలన్నీ సుప్త చేతనవస్థలో పడిపోయినప్పుడు.. ఈ సువిశాల భారతదేశంలో ప్రజలకు ఎంతో కొంత నమ్మకం కలిగించేది న్యాయ వ్యవస్థ మాత్రమే. అంతటి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఈ దేశ ప్రజలకు ఎంతో కొంత భరోసా కలిగించింది న్యాయవ్యవస్థ. ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు గండి కొట్టినప్పుడు అడ్డుగా నిలబడింది కూడా న్యాయవ్యవస్థే. అలాంటి న్యాయవ్యవస్థ తన పని తాను చేసినప్పుడు సమర్థించాల్సింది పోయి.. తప్పు పడితే దాన్ని ఏమనుకోవాలి? లేనిపోని వక్రీకరణలకు దిగి ఆరోపణలు చేస్తే దాన్ని ఏ విధంగా సమర్థించాలి? అంటే ఒక మీడియా హౌస్ ఇలాంటి పనులు చేయవచ్చా? అదే అనుకూలంగా తీర్పు వస్తే ఈ దేశంలో ధర్మం బతికే ఉంది అనే వ్యాఖ్యలు చేయవచ్చా? పై ప్రశ్నలన్నింటికీ ఆ పచ్చ ఛానల్ ఏబీఎన్ తన అడ్డగోలు ప్రసారాలతో న్యాయవ్యవస్థకే కళంకం ఆపాదిస్తోంది.
హైకోర్టు తీర్పుపై ఎందుకంత మంట?
కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మే 31 వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సిబిఐ ని ఆదేశించింది. ఈ తీర్పు ఎప్పుడైతే వచ్చిందో, ఈ  తీర్పు ఇప్పుడైతే తాను బాకా ఊదుతున్న పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడైతే మారింది అనుకుందో.. అప్పుడే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రంగంలోకి దిగింది. ఆ చానల్ పసుపు ముక్క వెంకటకృష్ణ డిబేట్ మొదలుపెట్టాడు. ఎప్పటిలాగే తమ స్వరం వినిపించే వక్తలను చర్చా వేదికలోకి పిలిచాడు. ఈ డిబేట్ సందర్భంగా ఓ మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తన స్వరాన్ని తెలుగుదేశానికి అనుకూలంగా వినిపించాడు. అవినాష్ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తికి గణనీయమైన మొత్తంలో డబ్బు వచ్చిందని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ వ్యాఖ్యలను పదేపదే కోర్టు చేసిన ఏబీఎన్ వెంకటకృష్ణ.. న్యాయవ్యవస్థను కూడా జగన్ కొనేశాడనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ న్యాయవ్యవస్థను జగన్ కొని ఉంటే చర్లపల్లి జైలుకు వెళ్లేవాడు కాదు కదా! డబ్బులతో మేనేజ్ చేసే సత్తా ఉన్నవాడు అవినాష్ రెడ్డి మీద కేసు ఎందుకు కొనసాగిస్తాడు? అంటే తమకు వ్యతిరేకంగా తీర్పులు వస్తే న్యాయ వ్యవస్థ మొత్తం అవినీతిమయం అయిపోయిందని చెప్పడమేనా ఈ పచ్చ ఛానల్ ఉద్దేశం? ఏపీ హైకోర్టు పలమార్లు జగన్ ప్రభుత్వాన్ని తూర్పార బట్టింది.. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించింది. మరి అప్పుడు సాక్షి ఇలా రకరకాల వక్రీకరణలకు దిగలేదు కదా?
ఎదురుదెబ్బ ఎలా అయ్యింది?
ఏపీ లేదా తెలంగాణ హైకోర్టులు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అని తాటికాయంత అక్షరాలతో వార్తలను ప్రచురించి, ప్రసారం చేసే ఏబీఎన్.. వైయస్ అవినాష్ రెడ్డి కేసులో మే 31 వరకు అరెస్టు చేయకూడదని తీర్పు ఇస్తే.. దానిని తప్పు అని నిర్ధారిస్తోంది. అంతేకాదు న్యాయమూర్తులకు కూడా రకరకాల ఉద్దేశాలను ఆపాదిస్తోంది. ఇక ఈ చర్చలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా అవినాష్ రెడ్డి పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పట్టడం విశేషం. న్యాయమూర్తి పై రకరకాల ఆరోపణలు చేయడం గమనార్హం.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, ధిక్కారానికి దారి తీసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించడం విస్మయాన్ని కలిగిస్తోంది.. అంటే ఇటువంటి పరిణామాలు చూసిన తర్వాత చంద్రబాబు మినహా ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరూ అధికారంలోకి ఉండకూడదు, కాదని ఇంకెవరూ అధికారంలోకి వచ్చినా మేము ఉండనీయబోమని ఈ పచ్చ ముఠా సంకేతాలు ఇస్తోంది. ఇలాంటి అతి చేయడం వల్లే కదా 2019లో ఏపీ ప్రజలు 23 సీట్ల దగ్గర కూర్చోబెట్టింది. అయినప్పటికీ గత ఓటమి నుంచి ఫలితాలు నేరవకుండా… ఇలాంటి ఆరోపణలు చేయడం.. అది కూడా న్యాయవ్యవస్థపై చేయడం ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి మాత్రమే చెల్లింది..
వీళ్ళు ఏది చెప్తే అది తీర్పు అవుతుందా
వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ విచారణ జరుపుతోంది.. సరే దీనిపై రాజకీయ ఒత్తిళ్లు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అయితే కేసు దర్యాప్తులో వేగం పుంజుకుంది. అయితే ఇందులో ఏపీ పోలీసులు సిబిఐ అధికారులకు సహకరించడం లేదనేది వాస్తవం. అయితే మొదట్లో సిబిఐ చేత విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చిన జగన్.. తర్వాత యూటర్న్ తీసుకుంది నిజం. చివరకు సునీత రెడ్డి ఫిర్యాదుతో సిబిఐ రంగంలోకి దిగింది కూడా నిజమే.. త్వరలో నిందితులకు శిక్ష కూడా పడేది నిజమే. ఇలాంటప్పుడు న్యాయవ్యవస్థ చెప్పిందే తీర్పు అవుతుంది కానీ.. న్యూస్ చానల్స్ డిబేట్లు నిర్వహించిన అంత మాత్రాన అది తీర్పు కాబోదు. మన న్యాయ వ్యవస్థను ఎంతోమంది మేధావులు రూపొందించారు. అందులో ఏమైనా తప్పులు ఉంటే బాధ్యత గల మీడియాగా ఏబీఎన్ ప్రశ్నించవచ్చు. అంతేగాని ఇష్టానుసారంగా న్యాయవ్యవస్థకు రకరకాల అపప్రదలు ఆపాదించడం సరైనది కాదు. రేపటి నాడు జగన్ స్థానంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే… కోర్టు ఇదే తీరుగా తీర్పు ఇస్తే అప్పుడు ఏబీఎన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో మరీ?!