New Parliament : నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటులు ఇచ్చిన ట్వీట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం రాత్రి రీట్వీట్ చేశారు. సూపర్‌స్టార్స్ అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్ వాయిస్ ఓవర్లతో ఇచ్చిన ట్వీట్లను రీట్వీట్ చేస్తూ, అభినందించారు. మోదీ నూతన పార్లమెంటు భవనానికి సంబంధించిన వీడియోను మే 26న షేర్ చేసి, ప్రజలు తమ సొంత వాయిస్–ఓవర్‌తో షేర్ చేయాలని ప్రత్యేకంగా కోరిన సంగతి తెలిసిందే.
నూతన ప్రజాస్వామ్య గృహం..
మోదీ పిలుపు మేరకు అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్ కూడా తమ వాయిస్–ఓవర్‌తో నూతన పార్లమెంటు భవనం వీడియోను షేర్ చేశారు. షారూఖ్ ఇచ్చిన ట్వీట్‌లోని వాయిస్–ఓవర్‌లో, నూతన పార్లమెంటు భవనం మన ఆశల నూతన గృహమని తెలిపారు. మన రాజ్యాంగాన్ని బలపరిచేవారి నివాసమని తెలిపారు. ఇక్కడ 140 కోట్ల మంది భారతీయులు ఒకే కుటుంబంగా నిలుస్తారన్నారు. ప్రతీ గ్రామం, నగరం, దేశంలోని ప్రతి మూలకు చెందినవారికి స్థానం కల్పించేటంత పెద్దదిగా, విశాలంగా ఈ నూతన గృహం ఉంటుందన్నారు. ఈ నూతన గృహం చేతులు అన్ని కులాలు, జాతులు, మతాలకు చెందినవారిని అక్కున చేర్చుకుంటుందన్నారు. ‘‘నవ భారతానికి నూతన పార్లమెంటు భవనం, అయితే భారత దేశ కీర్తిప్రతిష్ఠల చిరకాల స్వప్నంతో’’ అని ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. మన రాజ్యాంగాన్ని బలపరిచేవారి కోసం ఎంతో అద్భుతమైన నూతన గృహమని తెలిపారు. ఇది ఈ గొప్ప దేశంలోని ప్రజల్లో ప్రతి ఒక్కరికీ ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. భారత దేశ వైవిద్ధ్యాన్ని పరిరక్షిస్తుందన్నారు. దీనికి ‘స్వదేశ్’ చిత్రంలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను జత చేశారు.
– షారూఖ్ ఖాన్∙ట్వీట్‌ను మోదీ రీట్వీట్ చేస్తూ, చాలా బాగా చెప్పారని ప్రశంసించారు. నూతన పార్లమెంటు భవనం ప్రజాస్వామిక బలం, ప్రగతిల చిహ్నమని తెలిపారు. ఇది సంప్రదాయం, ఆధునికతల మేళవింపు అని తెలిపారు.
భారత వృద్ధికి చిహ్నం..
నూతన పార్లమెంటు భవనం వీడియోకు వాయిస్–ఓవర్ ఇస్తూ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ ఇచ్చిన ట్వీట్‌లో, పార్లమెంటు నూతన భవనాన్ని చూడటం గర్వకారణమని తెలిపారు భారత దేశ అభివృద్ధికి విశిష్ట చిహ్నంగా ఇది ఎల్లప్పుడూ నిలవాలని ఆకాంక్షించారు. దేశ అభివృద్ధి పట్ల ప్రతి భారతీయుడు గర్వపడుతున్న సమయంలో తన సంతోషానికి అవధులు లేవని తెలిపారు.
– అక్షయ్ కుమార్ ట్వీట్‌ను నరేంద్ర మోదీ రీట్వీట్ చేస్తూ, ‘‘మీ ఆలోచనలను చాలా బాగా వెల్లడించారు’’ అని ప్రశంసించారు. మన నూతన పార్లమెంటు భవనం మన ప్రజాస్వామ్యానికి నిజమైన దిక్సూచి అని తెలిపారు. ఇది మన దేశ సుసంపన్న వారసత్వాన్ని, భవిష్యత్తు కోసం బలమైన ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
ఇది తమిళ శక్తి..
అధికారమార్పిడికి గుర్తుగా ఉపయోగించే చారిత్రత్మక రాజదండం ‘సెంగోల్’ను కొత్త పార్లమెంట్ భవనంలోని స్పీకర్ పోడియం వద్ద ప్రతిష్టించారు. ఇది సాంప్రదాయ చిహ్నానికి భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. తమిళ శక్తి యొక్క సాంప్రదాయ చిహ్నం– రాజదండం(సెంగోల్), భారతదేశ కొత్త పార్లమెంట్ భవనంలో ప్రకాశిస్తుంది. తమిళులు గర్వపడేలా చేసిన ప్రధాని నరేంద్రమోడీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రజినీ కాంత్ ట్వీట్ చేశారు.