Mosgallaku Mosagdu : పాన్ ఇండియా, వరల్డ్ ఇప్పటి ముచ్చట.. 52 ఏళ్ళ కిందటే  కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’

పూర్వం ఏ ఊరు వెళ్లినా ఏదో ఒక పాత సినిమా ఆడుతూ ఉండేది. ఇప్పుడు ఈ సినిమా బాగా ఆడితే అలాంటి రోజులు మళ్లీ రావచ్చని" ఆయన అభిమానులు చెబుతున్నారు

Written By: Bhaskar, Updated On : May 28, 2023 3:22 pm
Follow us on

Mosgallaku Mosagdu : “మోసగాళ్లకు మోసగాడు”.. 52 సంవత్సరాల క్రితం స్కోప్ లో తీసిన సినిమా అది. యూట్యూబ్ లో చూస్తే ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది. కొన్ని చోట్లయితే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అన్ని సంవత్సరాల క్రితం ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఎలా తీశారు? అంత ముందస్తుగా ఎలా ఆలోచించారు? ఇప్పుడు ఉన్న దర్శకులు ఆ స్థాయిలో తీయగలరా? అంటే ఈ ప్రశ్నలకు సమాధానం నో అనే వస్తుంది. ఆదినారాయణ రావు రీ రికార్డింగ్. ఇప్పుడు అలాంటి రీ రికార్డింగ్ ఇవ్వాలంటే ఎంత లేదన్నా నాలుగైదు కోట్లు అవుతుంది. అలాగే కెమెరా వర్క్ కూడా. పైగా ఆరుద్ర స్క్రీన్ ప్లే కూడా వీటికి మించి ఉంది. ఇక దాస్ దర్శకత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. స్వామి ఫోటోగ్రఫీ సెల్యూలాయిడ్ వండర్ లాగా కనిపిస్తుంది.

వ్యయ, ప్రయాసలకు ఓర్చి..
ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో ప్రయాసలకు ఓర్చి తీశారు. రాజస్థాన్ ఎడారిలో, సిమ్లా మంచుకొండల్లో   ఇలా విభిన్నమైన లొకేషన్ల లో సినిమా షూటింగ్ చేసి దానిని గొప్పగా మలిచారు. ఆదినారాయణ రావ్ సంగీతం, కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వం, వి ఎస్ ఆర్ స్వామి ఫోటోగ్రఫీ ఈ సినిమా చూస్తున్నంత సేపు మనల్ని ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి. అసలు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేనప్పుడు, అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి, 50 దేశాల్లో విడుదల చేశారంటే మాటలు కాదు. ఇవాళ మనం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలంటూ మాట్లాడుతున్నాం. కానీ, 52 సంవత్సరాల కిందటే మోసగాళ్లకు మోసగాడు నిర్మించారు అంటే మామూలు విషయం కాదు. నిజంగా దాన్ని ఒక సాహసం అని చెప్పాలి. కలర్ ఫిలిం దొరకని రోజుల్లో.. వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోవలసిన స్థితిలో.. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి నిర్మాత మదనపడే వేళల్లో.. ఇంతటి గొప్ప సినిమా తీశారు అంటే కృష్ణ సాహసానికి సలాం చెప్పాల్సిందే.
రామారావు, నాగేశ్వరరావుకు పోటీగా..
ఆ రోజుల్లో వెండి తెరను రామారావు, నాగేశ్వరరావు ఏలుతున్నారు. అంత ధైర్యం, సాహసం చేసి, అది కూడా సొంతంగా పద్మాలయ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి, దానిమీద సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. ట్రెజర్ హంట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా నిర్మించడం సూపర్ స్టార్ కృష్ణ కే చెల్లింది. పైగా అప్పటికి కృష్ణ ఆర్థికంగా స్థితిపరుడు కాదు. అష్టకష్టాలు పడి ఆ సినిమా తీశారు. వాళ్ల కష్టానికి ప్రతిఫలంగా సినిమా సూపర్ హిట్ అయింది. అప్పుడు మాత్రమే కాదు ఇప్పుడు చూసినా అదే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. ఇక కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఆయన తనయుడు మహేష్ బాబు, సోదరుడు ఆదిశేషగిరిరావు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. “మోసగాళ్లకు మోసగాడు” తర్వాత “అల్లూరి సీతారామరాజు”ను స్కోప్ టెక్నాలజీ లో తీశారు. “సింహాసనం” సినిమాను స్టీరియో ఫోనిక్ సౌండ్ తో 70 ఎంఎం లో తీశారు. ఇప్పుడు ఇక మోసగాళ్లకు మోసగాడు సినిమాను ప్రస్తుత టెక్నాలజీ అప్ గ్రేడ్ చేసి, ప్రేక్షకులకు కనుల విందు లాగా ఉండేలాగా రూపొందించారు. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
పూర్వ వైభవం రావచ్చు
“ఇక అప్పట్లో విజయవాడ మారుతి టాకీస్ లో ఎనిమిదేళ్లు ఏకధాటిగా కృష్ణ సినిమాలు తప్ప వేరేవి ఆడలేదు. థియేటర్ల ఫీడింగ్‌ కోసమే ఆయన సినిమాలో తీశారు. ఒకే ఏడాదిలో పన్నెండో పద్ధెనిమిదో చిత్రాలు విడుదల చేసిన ఘనత కూడా ఆయన ఒక్కడిదే. ‘మోసగాళ్లకు మోసగాడు’ ఇప్పుడు బాగా ఆడితే రీ-రిలీజ్‌ సినిమాలు మరిన్ని రావడానికి అవకాశం ఉంటుంది. దీనిలా అన్నీ డిజిటలైజ్‌ చేసి వదిలితే బాగుంటుంది. పూర్వం చాలా థియేటర్లు రీ-రన్‌తో నడుస్తుండేవి. మళ్లీ ఆ పరిస్థితి వస్తే పాత సినిమాలను వెండితెరపై ఆస్వాదించే వీలుంటుంది. ఇప్పుడు కొత్త సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడడంలేదు. డిజిటల్‌ టెక్నాలజీకి మారాక పాత సినిమాలూ రావడంలేదు. పూర్వం ఏ ఊరు వెళ్లినా ఏదో ఒక పాత సినిమా ఆడుతూ ఉండేది. ఇప్పుడు ఈ సినిమా బాగా ఆడితే అలాంటి రోజులు మళ్లీ రావచ్చని” ఆయన అభిమానులు చెబుతున్నారు