https://oktelugu.com/

Narasaraopeta: నరసరావుపేటలో విగ్రహ రాజకీయం..కోడెల అభిమానుల మనస్థాపం

నరసరావుపేటలో కోడెల విగ్రహ రాజకీయం మలుపు తిరుగుతోంది. కోడెల విగ్రహ ఏర్పాటును స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో టిడిపిలో విభేదాలు బయటపడుతున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : November 5, 2024 / 08:59 AM IST

    Narasaraopeta

    Follow us on

    Narasaraopeta: మాజీ స్పీకర్, టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు విగ్రహా రగడ ఏర్పడింది. పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న కోడెల విషాదాంతం అందరికీ తెలిసిందే. వైసీపీ వేధింపులకు ఆయన బలవన్ మరణానికి పాల్పడ్డారని టిడిపి వర్గాలు చెబుతుంటాయి. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు అవకాశం దక్కించుకున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో కోడెలను టార్గెట్ చేసుకుంది జగన్ సర్కార్. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లో రాణించాలనుకున్నారు తనయుడు శివరాం. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు నరసరావుపేట అసెంబ్లీ టికెట్ దక్కలేదు. కొద్ది రోజులపాటు పార్టీ హై కమాండ్ పై నిరసన వ్యక్తం చేశారు. చివరకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగడంతో శాంతించారు. అయితే ఇప్పుడు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో కోడెల విగ్రహ ఏర్పాటుకు అభిమానులు ఏర్పాట్లు చేశారు. కానీ స్థానిక రాజకీయాల కారణంగా ఆయన విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ.. పక్కన పెట్టారు. ఆసుపత్రిలోని బాత్రూం వద్ద పడేశారు. దీనిపై ఆయన తనయుడు శివరాం తో పాటు టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన స్పందిస్తూ తక్షణం కోడెల విగ్రహం ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కోడెల శివప్రసాదరావు నరసరావుపేట నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారని.. ఆసుపత్రిని మంజూరు చేయించిన ఘనత ఆయనదేనని.. అక్కడే విగ్రహం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయితే అక్కడ అనుమతులు లేకుండా విగ్రహ ఏర్పాటు తగదని.. గౌరవంగా, అత్యంత వేడుకగా కోడెల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అయితే కోడెల తనయుడు కి కాకుండా వేరే వ్యక్తికి ఇక్కడ టికెట్ దక్కింది. ఆయనే ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఆదేశాలతోనే మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని పక్కన పడేసారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీలో విభేదాలు అంటూ ప్రచారం ప్రారంభమైంది. అయితే ఈ విషయంలో ఎవరైనా అతిగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు.

    * టిడిపి ఆవిర్భావం నుంచి
    తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తూ వచ్చారు కోడెల శివప్రసాదరావు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఐదుసార్లు నరసరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014లో మాత్రం కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పుడే నవ్యాంధ్రప్రదేశ్ కు అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 1996 -97 లో భారీ మధ్య తరహా, నీటిపారుదల శాఖ మంత్రిగా, 1997-99 మధ్య పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.

    * విషాదాంతం
    2019 ఎన్నికల్లో రెండోసారి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కోడెల. వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతులు ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కోడెల పై దాడి కూడా జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనతోపాటు కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఊహించని నిర్ణయం తీసుకున్నారు. పల్నాటి పులికా కార్యకర్తలతో పిలిపించుకున్న కోడెల తన రాజకీయ ప్రస్థానం మాత్రమే కాదు.. తన జీవన ప్రస్థానాన్ని ఆత్మహత్యతో ముగించారు.