Tirumala Cheetah: తిరుమల అలిపిరి మెట్ల దారిలో గతేడాది లక్షిత అనే బాలికపై దాడిచేసి చంపిన చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దాడి తర్వాత అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారం పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆరు చిరుతలను బంధించారు. వాటిని తిరుమల జూకు తరలించారు. ఈ చిరుతల్లో నాలుగో చిరుత లక్షితను చంపినట్లు ల్యాబ్ రిపోర్టు ఆధారంగా గుర్తించారు.
ఆ చిరుత అక్కడే..
లక్షితను చంపిన చిరుతను గుర్తించడంతో టీటీడీ, అటవీశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మ్యాన్ హంటింగ్ చిరుతను జూ పార్కులోనే ఉంచాలని నిర్ణయించారు. గతేడాది ఆగస్టు 11న నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన దినేష్ శశికళ దంపతులు కుటుంబ సభ్యులతో తిరుమలకు వచ్చారు. అలిపిరి నడకమార్గంలో కొండపైకి బయల్దేరారు. రాత్రి 7:30 గంటల సమయంలో దినేష్ శశికళ దంపతుల కుమార్తె లక్షిత.. అలిపిరి నడక మార్గంలోని లక్ష్మినరసింహ స్వామి ఆలయం దగ్గర రాగానే కనిపించలేదు. ఆమెను అడవిలోని జంతువులు లాక్కెళ్లాయని అర్థంకావడంతో వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు గాలింపు చేపట్టారు.
మరుసటి రోజు మృతదేహం..
ఆగస్టు 12న ఉదయం లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి సమీపంలో చిన్నారి లక్షిత మృతదేహాన్ని గుర్తించారు. ఘటన స్థలంలో లభించిన ఆనవాళ్ల ఆధారంగా చిరుత దాడిచేసి చంపినట్లు గుర్తించారు. దీంతో వెంటనే టీటీడీ అధికారులు, అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఆరు చిరుతలను బంధించి..
మెట్లమార్గం సమీపంలోకి వచ్చే చిరుతలను బంధించేందుకు అలిపిరి మెట్ల మార్గం సమీపంలో బోనులు ఏర్పాటు చేశారు. ఇలా దాదాపు ఆరు చిరుతలను బంధించారు. వాటిలో నాలుగో చిరుత లక్షితను చంపినట్లు గుర్తించారు. దాని శరీరంలో మానవ విశేషాలు ఉన్నట్లు లాబ్ లో గుర్తించారు. ఈ చిరుత దంతాలు కూడా ఓడిపోయినట్లు నిర్ధారించారు. చిరుత గతేడాది ఆగస్టు 27 బోనులో చిక్కింది. అలిపిరి నడక మార్గంలో 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఉంది.. ఆగస్టు 28న చిరుత బోనుకు చిక్కిన విషయాన్ని గుర్తించారు అటవీశాఖ అధికారులు.
ఆంక్షలు..
లక్షిత ఘటన తర్వాత అలిపిరి నడకమార్గంలో టీటీడీ ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 12 ఏళ్లలోపు పిల్లలను నడకమార్గంలో తిరుమలకు అనుమతించడం లేదు. పెద్దవాళ్లను కూడా రాత్రి 10 తర్వాత అనుమతించడం లేదు. కొద్దిరోజులు ఘాట్ రోడ్డలో కూడా బైక్‌లపై వెళ్లేవారిని అనుమతించలేదు. ఆ తర్వాత సడలించారు. ప్రస్తుతం నడక మార్గంలో వెళ్లేవారికి టీటీడీ చేతి కర్రలను అందిస్తోంది. మరోవైపు నడక మార్గంలో కంచె ఏర్పాటుపైనా అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నిపుణల కమిటీ కూడా పరిశీలన చేసింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More