Skill Development Case: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం. ఈ కేసులో మాజీ మంత్రి అచ్చెనాయుడు పేరును ఏపీ సిఐడి యాడ్ చేసింది. ఆయన ప్రమేయాన్ని నిర్ధారిస్తూ ఏ 38 నిందితుడిగా చూపింది. దీంతో ఇది కొత్త మలుపు తిరిగినట్టు అయ్యింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజులు పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు తన అరెస్టు విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ పూర్తయింది. కానీ తీర్పు రిజర్వ్ లో ఉంచారు. ఈ కేసులో సిఐడి చార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో అచ్చెనాయుడు పేరు దాఖలు చేయడం విశేషం.
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ పథకానికి సంబంధించి సి మెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు అప్పటి టిడిపి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. రికార్డుల్లో మాత్రం డిజైన్ టెక్ గా చూపుతోంది. ఇక్కడే భారీగా అవకతవకలు జరిగాయని తెలుస్తోంది. అటు సిఐడి కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తోంది. మంత్రివర్గం అనుమతి లేకుండా, తీర్మానం చేయకుండా సీఎం చంద్రబాబు ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తూ కేసును పట్టు బిగించింది. పైగా రికార్డులు పరిశీలించకుండా మంత్రిగా ఎలా సంతకం చేశారని అభియోగాలు మోపుతూ.. అచ్చెనాయుడును బాధ్యుడిని చేస్తూ ఏ 38 నిందితుడిగా ఆయనను చూపడం విశేషం. గతంలో అచ్చెనాయుడుపై ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిఐడి పరంగా ఇది రెండో కేసు.
అయితే ఎన్నికల ముంగిట రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అచ్చెనాయుడు పేరును తెరపైకి తీసుకు వచ్చారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై అచ్చెనాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ ఈరోజు జరగనుంది. కోర్టుకు అచ్చెనాయుడు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పై ఉన్నారు. దీంతో అచ్చెనాయుడుకి సైతం బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.