Ranganath Meet AP Deputy CM Pawan Kalyan: ఏపీలో( Andhra Pradesh) హైడ్రాను తీసుకొస్తారా? తెలంగాణ మాదిరిగా భూముల రక్షణకు సరికొత్త వ్యవస్థను ప్రారంభిస్తారా? ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తిగా ఉన్నారా? అందుకే హైడ్రా కమిషనర్ను పిలిపించుకొని మాట్లాడారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తెలంగాణలో భూ కబ్జాలను నియంత్రించేందుకు.. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రేవంత్ సర్కార్ హైడ్రా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థకు విశేష అధికారాలు కల్పించి హైదరాబాదులో ఎంట్రీ చేశారు. దీంతో హైడ్రా తర,తమ అన్న భేదం లేకుండా దూకుడు చూపించింది. అన్ని పార్టీల్లోనూ హైడ్రా బాధితులు ఉన్నారు. అయితే ఇటీవల హైడ్రా దూకుడు తగ్గించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో హైడ్రా రానుందన్న టాక్ ప్రారంభం అయింది.
* పవన్ ను కలిసిన హైడ్రా కమిషనర్..
ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్( Hydra commissioner Ranganath) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. డిప్యూటీ సీఎం కార్యాలయానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో హైడ్రా స్థితిగతులను పవన్ అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో హైడ్రా లాంటి శక్తివంతమైన వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తద్వారా ఏపీలో అటువంటి వ్యవస్థను ప్రారంభించే ఉద్దేశంతో ఈ విషయాలను తెలుసుకున్నారా? అనే చర్చ ప్రారంభం అయింది. విజయవాడ వరదల సమయంలో.. బుడమేరు నీరు పొంగి ప్రవహించిన క్రమంలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో బుడమేరును ఆక్రమించి నిర్మాణాలను చేయడం వల్లే అలా జరిగిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఆ సమయంలో ఆక్రమణల నియంత్రణకు హైడ్రా లాంటి వ్యవస్థ వస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం వినిపించింది.
* భూ ఆక్రమణలపై ఫిర్యాదులు..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలపై ఎక్కువ మంది ఫిర్యాదులు చేస్తున్నారు. విజయవాడ తో పాటు విశాఖలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎక్కువగా భూములు చేతులు మారాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖ పాలన రాజధానిగా చేయడం వెనుక ఈ భూకబ్జాలు ఉన్నాయన్నది ఒక ప్రధాన ఆరోపణ. పాలన రాజధానిగా విశాఖను ఎంపిక చేసిన తర్వాత వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఆక్రమణలపై ఎలా ముందుకు వెళ్లాలో తెలియడం లేదు. అందుకే హైడ్రా లాంటి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసి కబ్జాల పర్వం పై గట్టిగానే ఉక్కుపాదం మోపాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆ బాధ్యతలను ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( deputy CM Pawan Kalyan)తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగానే హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు తెలుస్తోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.