Chandrababu: సాధారణంగా దంపతుల మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడం సర్వసాధారణం కూడా. అది ప్రతి ఇంట్లో కనిపిస్తుంటుంది. భార్య చేసే వంటలు బాగుంటే.. బాగున్నాయని చెప్పడం ఒక సహజ చర్య. మరి బాగున్నాయంటే మెచ్చుకోవడం పరిపాటి. అయితే సోషల్ మీడియాలో దీని గురించి చర్చించుకుంటే మాత్రం అది వైరల్ వార్తే. చంద్రబాబు దంపతుల విషయంలో ఇదే జరిగింది. చంద్రబాబు ఒక విషయం గురించి అడిగితే.. అంతే వేగంగా స్వీట్ సమాధానంతో భువనేశ్వరి రిప్లై ఇవ్వడం ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఆ ఇద్దరు దంపతులు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఎన్నికల సమీపిస్తుండడంతో జనసేనాని పవన్ తో చంద్రబాబు ఉమ్మడి సభల్లో పాల్గొంటున్నారు. చాలా బిజీగా ఉన్నారు. అటు భువనేశ్వరి సైతం నిజం గెలవాలి యాత్రలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఆమె అరకు ప్రాంతంలో పర్యటించారు. అక్కడ కాఫీ దుకాణం ఎదుట కూర్చొని అరకు కాఫీ తాగారు. ఆ ఫోటోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు చంద్రబాబు తన అధికారిక ఖాతా నుంచి.. కాఫీ ఎలా ఉంది భువనేశ్వరి అని ప్రశ్నించారు. చంద్రబాబు ట్విట్ చేసిన కొంత సేపటికే భువనేశ్వరి స్పందించారు. కాఫీ అద్భుతంగా ఉందన్నారు. ప్రస్తుతం ఆ దంపతుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరోవైపు భువనేశ్వరి భిన్నంగా స్పందించారు. చంద్రబాబుకు కాఫీ అద్భుతంగా ఉందని చెబుతూనే.. మన కిచెన్ లో ఉన్నప్పటికీ అరకు ప్రకృతి మధ్య అరకు కాఫీ తాగితే కలిగే అనుభూతి వేరు అని చెప్పుకొచ్చారు. గిరిజనుల ఆత్మీయత అరకు కాఫీకి అదనపు రుచి తెప్పిస్తుందని అభిప్రాయపడ్డారు. నాడు అరకు కాఫీని చంద్రబాబు ప్రమోట్ చేసిన విషయాన్ని సైతం గుర్తు చేశారు. దీంతో అరకు కాఫీ ప్రాముఖ్యత మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అరకు బ్రాండ్ కాఫీని అంతర్జాతీయంగా మార్కెట్ చేసే అవకాశాన్ని కల్పించారు. గిరిజనులకు ఉపాధి కల్పించడంతో పాటు అరకు కాఫీకి ప్రపంచ ఖ్యాతిని తెప్పించారు. అప్పట్లో అమెరికాలో కూడా పలుచోట్ల స్టాల్స్ పెట్టడం విశేషం. కాగా చంద్రబాబు భువనేశ్వరి దంపతుల కాఫీ కబుర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.