https://oktelugu.com/

Nellore YCP: వైసీపీకి షాక్.. ఆ నలుగురు రాజీనామా

గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే జగన్ ప్రభంజనంలో సైతం ఆయన వందల మెజారిటీతోనే గట్టెక్కారు.

Written By:
  • Dharma
  • , Updated On : February 28, 2024 / 06:01 PM IST
    Follow us on

    Nellore YCP: మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు ఉంది నెల్లూరు వైసీపీ దుస్థితి. రోజుకో షాక్ తగులుతోంది జిల్లాలో ఆ పార్టీకి. కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా నెల్లూరు డిప్యూటీ మేయర్ తో పాటు నలుగురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా ప్రకటించారు. ఇందులో మైనారిటీ నేతలు కూడా ఉండడం విశేషం. వైసీపీలో తీవ్ర విభేదాలతోనే వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే జగన్ ప్రభంజనంలో సైతం ఆయన వందల మెజారిటీతోనే గట్టెక్కారు. అప్పట్లో ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ తో పాటు రెడ్డి సామాజిక వర్గం నేతలు సమన్వయంగా వ్యవహరించి అనిల్ గెలుపునకు పాటుపడ్డారు. గెలిచిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ను జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే తన గెలుపు కోసం కృషి చేసిన వారందరినీ పక్కన పెట్టారు అనిల్ కుమార్ యాదవ్. జిల్లాలోని ఇతర వైసీపీ నేతలతో సైతం వివాదాలు పెట్టుకున్నారు. జగన్ వద్ద ఉన్న పలుకుబడితో ఇష్టా రాజ్యంగా వ్యవహరించారు. దీంతో వైసీపీలో విభేదాలకు కారణమయ్యారు. అటు పార్టీ చేపట్టిన సర్వేలో కూడా వెనకబడ్డారు. ఈ తరుణంలో జగన్ అనిల్ ను మార్చారు. నరసరావుపేట ఎంపీ స్థానానికి పంపించారు. అదే సమయంలో అనిల్ అనుచరుడు డిప్యూటీ మేయర్ ఖలీల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

    అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతోనే రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఖరారైన వేంరెడ్డి ఒక షరతు పెట్టారు. నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ను మార్చాలని.. తాను సూచించిన వ్యక్తికే ఇవ్వాలని కోరారు. అయితే అప్పట్లో సమ్మతించిన జగన్.. తరువాత అనిల్ మాటకు ప్రాధాన్యమిచ్చారు. దీంతో వేంరెడ్డి తన దారి తాను చూసుకున్నారు. మరోవైపు అనిల్ బాబాయి రూప్ కుమార్ సైతం అభ్యర్థిత్వాన్ని ఆశించారు. కానీ ఆయనను జగన్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తో పాటు నలుగురు కార్పొరేటర్లు రాజీనామా ప్రకటించారు. వీరంతా చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.