Andhra Pradesh: ఏపీలో( Andhra Pradesh) నిరుపేదలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి రెండు సెంట్లు నివాస స్థలాన్ని కేటాయించనున్నట్లు వెల్లడించింది. మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించి నిర్ణయానికి తీసుకుంది. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ చాలామందికి అది సాకారం కావడం లేదు. నిరుపేదలకు అందని ద్రాక్షగా మిగిలింది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు పక్కా ఇల్లు కట్టిస్తామని హామీలు ఇస్తుంటాయి. తాము అధికారంలోకి వస్తే పేదలందరికీ ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే పనిలో పడ్డారు. పేదలకు సొంతింటి స్థలం అందించేందుకు నిర్ణయించారు.
* నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో
వైసిపి( YSR Congress ) ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు అందించారు. కానీ నివాసయోగ్యం కానీ ప్రాంతాల్లో లేఅవుట్లు ఏర్పాటు చేసినట్లు విమర్శలు వచ్చాయి. అక్కడ ఇల్లు కట్టుకునేందుకు ప్రజలు కూడా పెద్దగా ఆసక్తి కనబరచలేదు. దీంతో ఆ లేఅవుట్లలో స్థలం అలానే ఉండిపోయింది. అయితే ఈసారి అలా కాకుండా నివాసయోగ్యం అయిన ప్రాంతాల్లోనే ఇంటి స్థలాలు అందించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందకపోయిన వారికి ప్రాధాన్యం ఇస్తూ ఇళ్ల స్థలాలను కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు.. క్యాబినెట్ సైతం ఆమోదం తెలిపినట్లు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.
* వేర్వేరుగా లబ్ధిదారులు
గ్రామీణ ప్రాంతాల్లో( rural areas ) ఉండే పేదలకు మూడు సెంట్లు స్థలం, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. గతంలో వైసిపి ప్రభుత్వం చాలాచోట్ల లేఅవుట్లను ఏర్పాటు చేసింది. అక్కడే సెంటు నుంచి సెంటున్నర స్థలం కేటాయించింది. కానీ అప్పటి వైసీపీ నేతలు నివాసయోగ్యం కానీ భూములను ప్రభుత్వానికి విక్రయించి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటువంటి చోట్ల ఇల్లు కట్టుకునేందుకు చాలామంది లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. దీంతో గతంలో కేటాయించిన ఇళ్లపట్టాలను రద్దుచేసి.. నివాస యోగ్యత ఉన్న ప్రాంతాల్లో పట్టాలు అందించనున్నారు.
* త్వరలో మార్గదర్శకాలు
మరోవైపు ఇంటి స్థలాల ( house sites)అర్హులు, పథకానికి సంబంధించి రూపురేఖలపై మార్గదర్శకాలు తయారు చేసే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. ఇంటి స్థలాలు పొందాలంటే గరిష్టంగా ఐదు ఎకరాల్లో మెట్ట భూమి గాని, రెండున్నర ఎకరాల్లోపు మాగాణి భూమి గానీ ఉండేవారే అర్హులు. రాష్ట్రంలో ఆక్రమణలకు గురై అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారిలో అర్హులకు వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2019 అక్టోబర్ 15 నాటికి నిర్మించుకున్న ఇళ్లను మాత్రమే క్రమబద్ధీకరిస్తే ఛాన్స్ కనిపిస్తోంది. జీవో నెంబర్ 84 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.