Home Stay Scheme : నగరాల్లో( cities) ఇల్లు ఉన్నవారికి శుభవార్త. ముఖ్యంగా విశాఖ నగరంలో ఉంటే మరీ మంచిది. వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ పర్యాటకశాఖ. విశాఖ వచ్చే పర్యాటకులకు హోం స్టే సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. కనీసం ఒక గది నుంచి ఆరు గదుల వరకు అన్ని వసతులతో పర్యాటకులకు అందించగలిగే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ మేరకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఏపీ పర్యాటకశాఖ. ఎవరికైనా సొంత ఇల్లు/ విల్లా/ అపార్ట్మెంట్ ప్లాట్ ఉండి.. వాటిని పర్యాటకులకు రోజువారి పద్ధతిలో అద్దెకు ఇవ్వడానికి ఆసక్తి ఉంటే పేర్లు నమోదు చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో హోమ్ స్టేలు ఏర్పాటు చేసుకునే క్రమంలో.. విశాఖ నగరవాసులకు ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పిస్తున్నారు.
Also Read : తెదేపా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ లేదా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా… నారా లోకేష్…?
* చాలా రాష్ట్రాల్లో సక్సెస్..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హోం స్టే( Home stay) విధానం అమల్లో ఉంది. విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ పర్యాటక శాఖ అధికారులు ఈ విధానంపై అధ్యయనం చేశారు. దీనివల్ల స్థానికులకు ఉపాధి లభిస్తోంది. పర్యాటకపరంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు అవసరం అయిన గదులు పర్యాటక, ప్రైవేటు సంస్థలు సమకూర్చలేకపోతున్నాయి. అటువంటి ప్రాంతాల్లో హోమ్ స్టేలు అందుబాటులోకి తెస్తే బాగుంటుందన్న నిర్ణయానికి ఏపీ టూరిజం శాఖ వచ్చింది. పర్యాటకంగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో స్థానికులే వారి గృహాలను అందంగా అలంకరించి, వాణిజ్య ధరలకంటే తక్కువకే వసతి కల్పించడం, ఇంట్లో వండిన ఆహార పదార్థాలను ఆప్యాయంగా వడ్డించడం వల్ల పర్యాటకుల సంతృప్తి శాతం పెరుగుతుందని అంచనా వేస్తోంది.
* ప్రధానంగా విశాఖపై ఫోకస్
విశాఖ నగరంలో( Visakha City ) హోమ్ స్టేల కోసం అద్దెకు ఇచ్చేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆ జిల్లా పర్యాటక శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ నగరానికి నిత్యం పర్యాటకుల తాకిడి ఉంటుంది. నగరంలో పర్యాటక ప్రాంతాలను సందర్శించేవారు ఏజెన్సీలో ఉన్న పర్యాటక ప్రదేశాలను సైతం చూసి వెళుతుంటారు. అందుకే విశాఖ నగరంలో పెద్ద ఎత్తున హోం స్టేలు ఏర్పాటు చేయాలని పర్యాటకశాఖ భావించింది. కనీసం ఒక గది నుంచి ఆరు గదుల వరకు అన్ని వసతులతో పర్యాటకులకు అందించగలిగే వారు పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్థ వెబ్సైట్లో ఎవరికి వారే తమ వివరాలను పొందుపరచవచ్చు. విశాఖ నగరంలో ఇతర వివరాలు అవసరం అయినవారు 08912754716 నంబర్కు సంప్రదించవచ్చు. దరఖాస్తుదారులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై విస్తృత అవగాహన ద్వారా విశాఖ నగరంలో హోమ్ స్టేల సంఖ్య పెంచాలని పర్యాటకశాఖ భావిస్తోంది. మొత్తానికైతే ఇదో అరుదైన అవకాశం గా భావించవచ్చు. ప్రధానంగా పర్యాటక శాఖ విశాఖ నగరం పై దృష్టి పెట్టడం విశేషం.