History behind the name Mahanadu: తెలుగుదేశం ( Telugu Desam) పార్టీకి మహానాడు ప్రత్యేకం. ఒక పండుగ లాంటి కార్యక్రమం. నాలుగు దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీ. ప్రతి సంవత్సరం జాతీయ అధ్యక్షుడు నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కలిసి చేసుకునే సంబరం ఇది. 1983 నుంచి ప్రతి ఏట మహానాడు జరుగుతూ వస్తోంది. ఇప్పటివరకు ప్రత్యేక పరిస్థితుల్లో వాయిదా వేయడం తప్ప.. 40 సంవత్సరాలుగా మహానాడు జరుపుతూ వస్తున్నారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. 1983 నుంచి మహానాడు కొనసాగుతూ వస్తోంది. పార్టీ నిర్మాణం, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై అందరూ కలిసి చర్చించి, తీర్మానాలు ఆమోదించుకోవడం పార్టీ ఆరంభం నుంచి వస్తున్న సంప్రదాయం. పార్టీ అధ్యక్షుడు ఎన్నిక కూడా ఇక్కడే జరుగుతుంది.
* సుదీర్ఘ నేపథ్యం
మహానాడు ( mahanadu ) పేరు వెనుక సుదీర్ఘ నేపథ్యం ఉంది. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ప్రకటించారు నందమూరి తారక రామారావు. పార్టీ అజెండా తో పాటు ప్రజలకు తాము ఏం చెప్పాలనే దానిపై ఒక సభ నిర్వహించాలని భావించారు ఎన్టీఆర్. ఆ ఏడాది ఏప్రిల్ 11న హైదరాబాదులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దానినే మహానాడు సభగా ప్రకటించారు. 1982 మే 28న ఎన్టీఆర్ జన్మదినం నాడు తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి మహానాడు అని పేరు పెట్టారు. అప్పటినుంచి మహానాడు వాడుకలో వచ్చింది. 1983లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అప్పటినుంచి ప్రతి ఏటా ఎన్టీఆర్ జన్మదినం నాడు మహానాడు ను నిర్వహించాలని నిర్ణయించారు. తొలి మహానాడును విజయవాడలో నిర్వహించారు. అప్పట్లో ఈ సభకు కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల నేతలు ఎంజి రామచంద్రన్, బాబు జగ్జీవన్ రామ్, ఫరూక్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చండ్ర రాజేశ్వరరావు, ఎల్కే అద్వానీ, వాజపేయి, రామకృష్ణ హెగ్డే, అజిత్ సింగ్, శరత్ పవర్, ఉన్ని కృష్ణన్, ఎస్ఎస్ మిశ్రా, రవీంద్ర వర్మ, మేనకా గాంధీ లాంటి నేతలు వచ్చారు.
* ప్రత్యేక పరిస్థితుల్లో వాయిదా
నాలుగు దశాబ్దాల టిడిపి( TDP ) చరిత్రలో.. కొన్నిసార్లు మహానాడు నిర్వహించలేదు. 1985, 1991, 1996, 2012, 2019, 24 లో మహానాడు జరగలేదు. 1985లో మధ్యంతర ఎన్నికల కారణంగా మహానాడు ను వాయిదా వేశారు. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత రాజకీయ పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు. 1995 ఆగస్టులో టిడిపిలో సంక్షోభం ఏర్పడింది. దీంతో 1996లో మహానాడు నిర్వహించలేదు. 2012లో సైతం ఎన్నికల కారణంగా జరగలేదు. 2019లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడంతో మహానాడు నిర్వహించలేదు. గత ఏడాది అంటే 2024లో సార్వత్రిక ఎన్నికలు కావడంతో మహానాడు నిర్వహించలేకపోయారు. 2020, 2021లో కరోనా కారణంగా మహానాడు నిర్వహణకు ఇబ్బందికరంగా మారింది. అయితే జూమ్ ద్వారా మహానాడు ను నిర్వహించారు. 2021 లోను డిజిటల్ వేదికపైనే మహానాడు జరిగింది.
Also Read: Pawan Kalyan key campaign in Tamil Nadu: తమిళనాడులో కూటమికి ఛరిస్మా అన్నామలై పవన్ కళ్యాణ్ లు
* ఎన్టీఆర్కు ఇష్టమైన ఆహారంతో
తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఇంకో ప్రత్యేకత ఉంది. కార్యక్రమానికి హాజరయ్యే పార్టీ శ్రేణులకు పసందైన వంటకాలు ఆహారంగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. మహానాడుకు వచ్చే ప్రతి కార్యకర్త భోజనం చేసేలా ఏర్పాట్లు చేయడం దీని ప్రత్యేకత. ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 28న ఆయనకు ఇష్టమైన ప్రత్యేకమైన మెనూ తో వంటలు చేస్తారు. రవ్వ కేసరి, ఇడ్లీ, కట్టె పొంగలి లేదా చక్కెర పొంగలి, మసాలా వడ, చింతపండు దప్పలం, కొత్త మామిడి పచ్చడి, ఉలవచారు, పూతరేకులు, మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ వంటివి తప్పనిసరిగా మెనూలో ఉంటాయి. ఈ ఏడాది కూడా 22 వంటకాలతో ప్రత్యేక ఆహార మెనూ ఉంది.