Kavitha Letter To KCR: అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని విషయాలలో కేసీఆర్ రాజీ పడక తప్పలేదు. దీంతో పార్టీలో అంతర్గత విషయాలు బయటకు రావడం మొదలయ్యాయి. వాటిని ఎప్పటికప్పుడు ఆదుపు చేసుకుంటూ వచ్చిన కేసీఆర్.. కుమార్తె తనకు లేఖలు రాస్తుందని విషయాన్ని పసిగట్టి ఉండరు. ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. దానిని క్యాష్ చేసుకోవడానికి భారత రాష్ట్ర సమితి చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి ఇటీవల నిర్వహించిన 25 ఏళ్ల పార్టీ వేడుకనూ తనకు రాజకీయంగా ఉపయోగించుకుంది. అయితే ఈ జోష్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపగా.. ఎప్పుడైతే కల్వకుంట్ల కవిత రాసిన లేఖలు బయటికి వచ్చాయో.. అప్పుడే పార్టీలో ఏదో జరుగుతోంది అనే ప్రమాదకరమైన సంకేతాలు బయటికి వెళ్లాయి. ఇది సహజంగానే పార్టీకి ఇబ్బంది కలిగించింది. ఆ వెంటనే కల్వకుంట్ల తారక రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందని.. పార్టీ గీత దాటి వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని ఆయన ఒక రకంగా హెచ్చరికలు జారీ చేశారు.
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి స్థానంలో కేటీఆర్ ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశారో.. అప్పుడే రాజకీయంగా కాక మొదలైంది. మొత్తంగా భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, ఆమె సోదరుడి మధ్య వివాదం మొదలైనట్టు బయటకు వెళ్లడైంది. వాస్తవానికి శంషాబాద్ విమానాశ్రయంలో దయ్యాలు అని వ్యాఖ్యానించిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ.. వారు ఎవరో క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కాకపోతే గులాబీ సుప్రీం కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ముగ్గురు మాత్రమే.. వారిలో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు మాత్రమే ఉంటారు.. ఈ ముగ్గురిని దాటి గులాబీ సుప్రీమ్ కలవాలంటే అంత సులభమైన విషయం కాదు.
ఎప్పుడైతే గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు విలేకరుల సమావేశం నిర్వహించారో.. వెంటనే గులాబీ సుప్రీం నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. దీంతో ఆయన వెంటనే కెసిఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు. అక్కడ వారిద్దరూ సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఇక గులాబీ కార్యనిర్వాహక అధ్యక్షుడికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాల వేదికగా గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బయటికి పంచుకోగా.. దీనిని ఖండిస్తూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ మధ్య కోల్డ్ వార్ తగ్గిపోయిందని సంకేతాలు ఇచ్చారు.
వ్యవసాయ క్షేత్రానికి తన కుమారుడిని పిలిపించుకున్న గులాబీ సుప్రీమ్.. కుమార్తె రాసిన లెటర్ విషయాన్ని.. అది బయటికి వచ్చిన విధానాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పార్టీలో అంతర్గత కలహాలు మంచివి కావని.. అలా జరిగితే మొదటికే మోసం వస్తుందని చెప్పినట్టు సమాచారం. అందువల్లే కేటీఆర్ కాస్త మెత్తబడ్డారని.. కవిత కూడా ఒక అడుగు వెనక్కి వేశారని తెలుస్తోంది. వారిద్దరి మధ్య అందువల్లే సయోధ్య కుదిరిందని గులాబీ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ఇంత వ్యవహారం జరిగినా ఇంతవరకు కవితకు తనతండ్రి నుంచి అపాయింట్మెంట్ లభించకపోవడం విశేషం. రేపు మాపో ఫామ్ హౌస్ తలుపులు బిడ్డ కోసం తెరుచుకుంటాయని గులాబీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.