Hidden camera : ఛీ ఇదేం పని.. ఏకంగా విద్యార్థినుల హాస్టల్ వాష్ రూమ్ లో హిడెన్ కెమెరాలు!

ఏకంగా హాస్టల్ వాష్ రూమ్ లో హిడెన్ కెమెరాలు అమర్చారు. ఆ వీడియోలను బయట విక్రయించారు. కృష్ణాజిల్లాలో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో వెలుగు చూసింది ఉదంతం. ఒక విద్యార్థి సూత్రధారిగా.. మరో విద్యార్థిని సహకరించడం సంచలనంగా మారింది.

Written By: Dharma, Updated On : August 30, 2024 12:47 pm

Hidden camera

Follow us on

Hidden camera :ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నామని చెబుతున్నా… విద్యాసంస్థల్లో వికృత చేష్టలు ఆగడం లేదు. ఒకవైపు ర్యాగింగ్ భూతం విద్యార్థులను కబళిస్తోంది. తాజాగా ఓ ఇంజినీరింగ్ కాలేజీలోని వాష్ రూమ్లలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేయడం కలకలం సృష్టించింది. సదరు కాలేజీలోని ఓ విద్యార్థి ఈ వికృత క్రీడకు దిగినట్లు తేలింది. దీంతో ఇది పెను సంచలనం గా మారింది. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు లోని ఇంజనీరింగ్ కాలేజీలో ఈ సీక్రెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాలేజీలో గురువారం అర్ధరాత్రి దాటాక విద్యార్థులు ఆందోళనకు దిగారు. బాలికల హాస్టల్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని వారంతా ఆరోపించారు. ఓ ఫైనల్ ఇయర్ విద్యార్థి పై ఆరోపణలు రాగా.. ఆయన ల్యాప్టాప్, మొబైల్ స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు. కెమెరా ఏర్పాటులో అతడికి మరో విద్యార్థిని సహకరించిందంటూ ఆరోపణలు

వినిపిస్తున్నాయి. పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల హామీతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి నడవడిక అభ్యంతరకరంగా ఉంది. మరో విద్యార్థిని సాయంతో బాలికల హాస్టల్ వాష్ రూమ్ లో హిడెన్ కెమెరాలు అమర్చినట్లు తెలుస్తోంది. సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి ఆ వీడియోలను బయటకు అమ్ముతున్నట్లు సమాచారం. ఈ విషయం బయటపడటంతో విద్యార్థినులు ఆ యువకుడి పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు సముదాయించడంతో వెనక్కి తగ్గారు.

* వారం రోజులు కిందటే వెలుగులోకి ఘటన
వారం రోజుల కిందటే ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు సమాచారం. విద్యార్థులకు ఈ విషయం తెలియడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి నుంచి ఆందోళనకు దిగారు. శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు కాలేజీలో హైడ్రామా నడిచినట్లు తెలుస్తోంది. ఈ హిడెన్ కెమెరాల విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో బయటపెట్టారు. గత వారం రోజులుగా కాలేజీలో ఇంత జరుగుతున్నా యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* వీడియోల విక్రయం
అయితే చాన్నాళ్లుగా ఈ తతంగం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సదరు ఫైనల్ ఇయర్ విద్యార్థి హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి.. ఆ వీడియోలను విక్రయిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. దీనిపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనతో ఉన్నారు. తమ పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకే ఈ వీడియోల విషయంలో నిగ్గు తేల్చాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉంటే కాలేజీలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈరోజు సెలవు ప్రకటించింది యాజమాన్యం.

* నారా లోకేష్ స్పందన
తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో కృష్ణాజిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతోంది.