Operation bhediya : యోగి.. ఈ పేరు చెబితే చాలు యూపీలో బుల్డోజర్లు గుర్తుకొస్తాయి. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయేందుకు, వారి ఆటను కట్టించేందుకు యోగి బుల్డోజర్ మార్క్ న్యాయాన్ని అందుకున్నారు. అందువల్లే ఉత్తర ప్రదేశ్ ప్రజలు ఆయనను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గినప్పటికీ.. యోగి పై ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ వాసులకు నమ్మకం తగ్గలేదు. పైగా అంతకంతకు పెరుగుతోంది.
తను అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లల్లోనే యోగి బుల్డోజర్ న్యాయాన్ని ప్రవేశపెట్టారు. ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారి ఇళ్ళ మీదకు బుల్డోజర్లను పంపారు. ఇక రౌడీషీటర్లు, అరాచక వాదులకు తనదైన శైలిలో బుద్ధి చెప్పారు. అయితే అలాంటి యోగి ప్రస్తుతం బుల్డోజర్ ను కాస్త పక్కన పెట్టి తోడేళ్ల వేటను ప్రారంభించారు. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నది ఇదే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భరాచ్ జిల్లా పూర్తి అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలో తోడేళ్లు విపరీతంగా సంచరిస్తున్నాయి. కొన్ని రోజులుగా వీటి సంచారం ఎక్కువ కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కేవలం రెండు నెలల కాలంలోనే తోడేళ్లు 8 మందిని చంపేశాయి. దీంతో ఆ జిల్లాలో బయటికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఈ విషయం కాస్త ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియడంతో.. వెంటనే యోగి స్పందించారు. అడవి శాఖ అధికారులను రంగంలోకి దింపారు.. దీంతో వారు ఆపరేషన్ భేడియా ను మొదలుపెట్టారు.
ఒకటి కాదు ఏకంగా మంద
భరాచ్ జిల్లాలో మనుషులపై తోడేలు దాడి చేసింది. ఆ దాడిలో ఒక వ్యక్తి చనిపోయాడు.. కొంతమంది గాయపడ్డారు. దానిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. వారు దాని ఆచూకీ కోసం గాలిస్తున్నప్పుడు.. వారికి విస్మయకర వాస్తవాలు తెలిసాయి. అయితే అది ఒకటి మాత్రమే కాదని, ఏకంగా మంద అని గుర్తించారు. ఆ తోడేళ్ల మంద ఆరుగురు చిన్నారులను, ఒక మహిళను, ఒక వ్యక్తిని చంపేశాయి. మెహసి తెహ్ సిల్ గ్రామంలో తోడేళ్ల దాడి వల్ల దాదాపు 30 మంది దాకా గాయపడ్డారు. ఆ తోడేళ్ల గుంపును గుర్తించేందుకు ఉత్తరప్రదేశ్ అటవీశాఖ అధికారులు అధునాతనమైన డ్రోన్లు, ఇన్ ఫ్రా రెడ్ కెమెరాలు ఉపయోగించారు. తోడేళ్ల గుంపు పై నిరంతరం నిఘా పెట్టారు. తోడేళ్లు సమీప గ్రామాల్లోకి రాకుండా ఉండేందుకు ఏనుగు మలమూత్రాలను ఎక్కడికి అక్కడ చల్లారు. వాటి వాసన గమనించిన తోడేళ్లు దూరంగా వెళ్లాయి. ఆ తర్వాత వాటికి అటవీశాఖ అధికారులు మత్తుమందు ఉపయోగించారు. తోడేళ్లు ఎక్కువగా సంచరిస్తాయనే అనుమానం ఉన్నచోట బోన్లు ఏర్పాటు చేశారు.. గ్రామీణ ప్రాంతాలలో గస్తీలు పెంచారు. ఈ ఆపరేషన్ ను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలుసుకున్నారు. ఇలా ఏకంగా నాలుగు తోడేళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వాటిని బంధించి సమీపంలో ఉన్న అడవిలో వదిలిపెట్టారు. అయితే మిగతా తోడేళ్లను కూడా పట్టుకుంటామని ఉత్తర ప్రదేశ్ అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ సాయం
తోడేళ్ల దాడిలో గాయపడి చనిపోయిన వారికి ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలు అందిస్తామని వెల్లడించింది. గాయపడిన వారికి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది కోలుకున్నారు. అయితే ఎన్నడూ లేనిది ఆ తోడేళ్లు ఇలా గ్రామాల మీదికి రావడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.