Rain Alert in AP: ఆంధ్ర ప్రదేశ్ కు( Andhra Pradesh) భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అలాగే మరో ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ రెండు ఆవర్తనాలు కలిసిపోయాయి. దీంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కూడా పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు అల్లూరి సీతారామరాజు( Alluri sitaramaraj ), బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా ఆదివారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో భారీగా మేఘాలు కమ్ముకున్నాయి. సోమవారం వేకువ జాము నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి.
Also Read: హత్యకు ముందు ఏం జరిగింది.. కోట వినూత డ్రైవర్ సెల్ఫీ వీడియో.. సంచలన నిజాలు వెలుగులోకి..
ఈశాన్య రుతుపవనాలు ఆగమనం..
మరోవైపు ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి. తెలంగాణ( Telangana), ఒడిస్సా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్,బీహార్ వంటి రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. మన రాష్ట్రం నుంచి కూడా రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా వేస్తున్నారు. వాటి ప్రభావం స్పష్టంగా ఉండనుంది. ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలోనే ఈ వర్షాలు అని వాతావరణ శాఖ చెబుతోంది. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పుకొస్తోంది వాతావరణ శాఖ. ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు అనేక రకాల సూచనలు చేసింది.