Kota Vinutha : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్చార్జి కోటా వినూత డ్రైవర్ సిహెచ్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు ఇటీవల చెన్నైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించిన విషయం తెలిసిందే. చెన్నై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా శ్రీనివాసరావును గుర్తుతెలియని వ్యక్తులు చంపారని తేలింది. అనేక ఆధారాలను పోలీసులు సేకరించి కేసును విచారించగా.. శ్రీనివాసరావును జనసేన శ్రీకాళహస్తి ఇన్చార్జి కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు అంతం చేశారని తేలింది. ఈ కేసులో వినూతకు బెయిల్ లభించింది. చంద్రబాబు, హత్యలో పాలుపంచుకున్న వారంతా జైల్లో ఉన్నారు. రాజకీయంగా కూడా ఈ ఘటన ఏపీలో సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి వచ్చింది.
ఈ దారుణం జరగడానికి ముందు శ్రీనివాసరావు అలియాస్ రాయుడు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో అనేక విషయాలను వెల్లడించాడు. ఈ వీడియోను వైసిపి తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.. ఆ వీడియోలో శ్రీనివాసరావు చెప్పిన మాటల ప్రకారం..” 2019 నుంచి వినూత వద్ద నేను నమ్మకంగా పనిచేస్తున్నాను. నవంబర్ నెలలో టిడిపి కార్యాలయంలో టిడిపి, జనసేన సమన్వయ సమావేశం జరిగింది. జనసేన పార్టీకి చెందిన చంద్ర, సుధీర్ రెడ్డి మనిషి సుజిత్ కు నన్ను పరిచయం చేశారు. నా ఫోన్ నెంబర్ సుజిత్ కు అందించారు. కొద్దిరోజుల తర్వాత పనిమీద రేణిగుంట నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుంటే.. చంద్ర బస్టాండ్ వద్ద కనిపించాడు. చంద్రని చూడగానే నేను మాటలు కలిపాను. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్ కళ్యాణమండపం వద్ద ఇద్దరం కలిసి మద్యం సేవించాం. ఈ క్రమంలోనే మా ఇద్దరి మధ్య అనేక చర్చలు జరిగాయి. అందులో సుజిత్ ఫోన్ గురించి ప్రస్తావన వచ్చింది. ఒకవేళ సుజిత్ గనుక నీకు ఫోన్ చేస్తే వినూత గురించి వివరాలు చెప్పాలని చంద్ర నాతో అన్నాడు. ఆమె వివరాలు కనుక చెబితే డబ్బులు ఇస్తామని నాతో చెప్పాడని” రాయుడు ఆ వీడియోలో పేర్కొన్నాడు.
” మరుసటి రోజు సుజిత్ నాకు ఫోన్ చేశాడు. చంద్ర నీకు ఏమైనా చెప్పాడా అని అడిగాడు. నువ్వు వినూత వివరాలు చెబితే అతడు నీకు డబ్బులు ఇస్తాడని సుజిత్ అన్నాడు. కానీ డబ్బులు ఎంత ఇస్తామని విషయం మాత్రం చెప్పలేదు. ఒకవేళ నీకు అతడు ఫోన్ చేస్తే అన్ని విషయాలు నువ్వు చెప్పాలని నాతో అన్నాడు. రెండు రోజులు పూర్తయిన తర్వాత ఎస్ఎస్ కళ్యాణమండపం మండపం వద్దకు రావాలని చంద్ర నాకు ఫోన్ చేశాడు. దీంతో నేను అక్కడికి వెళ్లాను. అక్కడికి వెళ్ళగానే చంద్ర, సుజిత్ కలిసి మద్యం తాగుతున్నారు. నన్ను కూడా మద్యం తాగమని బలవంతం చేశారు. సుజిత్ నీకు 30 లక్షలు ఇస్తాడు. అతను అడిగిన వివరాలు మొత్తం నువ్వు చెప్పాలని చంద్ర నాతో అన్నాడు. ఆ స్థాయిలో డబ్బులు ఎందుకని నేను అన్నాను. అప్పటికప్పుడే సుజిత్ నాకు రెండు లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకున్న నేను పార్టీ కార్యాలయంలో ఉన్న నా ర్యాక్ లో భద్రంగా దాచుకున్నాను.. సుజిత్ నాకు ఫోన్ చేసి.. అడిగిన వివరాలు మొత్తం చెప్పాను. ఎవరెవరు మేడం గారికి ఫోన్ చేస్తున్నారు, ఇతర వివరాలు మొత్తం అతనికి చెప్పానని” రాయుడు ఆ వీడియోలో పేర్కొన్నాడు.
ఆ వివరాలు మాత్రమే కాకుండా.. ఇంకా అనేక విషయాలను రాయుడు ఆ సెల్ఫీ వీడియోలో పంచుకున్నాడు. సుధీర్ రెడ్డిని వినూత దంపతులు తిడుతున్నారని.. వాళ్ళిద్దరు తిడుతున్న ఆడియో వాయిస్ రికార్డ్ చేసి రాయుడు సుజిత్ కి పంపించాడు. అయితే ఇలా వాయిస్ రికార్డు పెట్టిన విషయాన్ని చంద్ర రాయుడిని ప్రశ్నించాడు. సుజిత్ చెప్పినట్టే తాను చేశానని రాయుడు బదులిచ్చాడు. ఆ తర్వాత వారు చెప్పిన పని మొత్తం రాయుడు చేశాడు. అయితే ముందుగా ఇస్తామన్నట్టుగా 30 లక్షలు ఇవ్వలేదు. సుజిత్ కేవలం అతడికి 20 లక్షలు మాత్రమే ఇచ్చాడు. ఇదే విషయాన్ని రాయుడు అనేక పర్యాయాలు ప్రశ్నించాడు. ఈక్రమంలో రాయుడుకు సుజిత్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నువ్వు గనుక ఇంకో పని చేస్తే ఆయనే 30 లక్షలు ఇస్తాడని పేర్కొన్నాడు.. అతడు చెప్పినట్టుగానే వినూత, చంద్రబాబు ను రెండుసార్లు ప్రయత్నించాడు. అయితే ఆ రెండుసార్లు కూడా ఆ ప్రయత్నం విఫలమైంది. దీంతో వినుత రాయుడిని డ్రైవర్ పోస్ట్ నుంచి తొలగించింది. ఆ తర్వాత వినూత పర్సనల్ వ్యవహారాలను రాయుడు వీడియో తీసి సుధీర్ రెడ్డికి పంపించాడు.
అతడు వీడియో తీస్తున్న విషయం వినూత గుర్తించడంతో రాయుడు భయపడ్డాడు. ఆ తర్వాత పారిపోవడానికి ప్రయత్నించి కాలు విరగొట్టుకున్నాడు. చివరికి రాయుడు వ్యవహారం తెలియడంతో వినూత దంపతులు అంతం చేశారు. అయితే రాయుడు జూలై 7న హత్యకు గురైతే.. అతడి వీడియో ఇప్పుడు వెలుగులోకి రావడం విశేషం. ఇప్పటికే కూటమినేతలు తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం తయారు కేసులో కూరుకుపోయారు. దానిని మర్చిపోకముందే ఈ సెల్ఫీ వీడియో బయటికి రావడం సంచలనం కలిగిస్తోంది.
కోట వినూత డ్రైవర్ సంచలన వీడియో
హత్యకు ముందు రికార్డ్ అయిన కోట వినూత డ్రైవర్ వీడియో..వీడియోలో సంచలన నిజాలు చెప్పిన డ్రైవర్ రాయుడు
సిహెచ్.శ్రీనివాసరావు (రాయుడు)
2019 నుంచి వినీత వద్ద నమ్మకంగా పనిచేస్తున్నా
నవంబర్ నెలలో టీడీపీ పార్టీ ఆఫీస్ లో టీడీపీ , జనసేన సమన్వయ సమావేశం… pic.twitter.com/WEeFgetpep
— YSR Congress Party (@YSRCParty) October 12, 2025