Financial capital of AP: రాజకీయంగా కొందరికి అరుదైన అవకాశాలు వస్తుంటాయి. కానీ సద్వినియోగం చేసుకునేది కొందరే. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కొందరికి అనూహ్యంగా మంత్రి పదవులు దక్కాయి. అటువంటి వారిలో మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ ఒకరు. కీలకమైన ఐటి, పరిశ్రమల శాఖను దక్కించుకున్నారు. తన సమర్థతను నిరూపించుకోగల గొప్ప అవకాశం లభించింది. కానీ పదవిలో ఉన్నప్పుడే కాదు.. దిగిపోయిన తరువాత కూడా ఆయన చేస్తున్న ప్రకటనలు దిగజారుడుగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలో ఆయన వినోదాన్ని పంచే నేతగా మిగిలిపోయారు. తన పదవీకాలంలో శాఖపరమైన ప్రగతి కంటే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను ఎద్దేవా చేసేందుకే అన్న రీతిలో వ్యవహరించారు.
భారీగా పెట్టుబడులు..
అయితే ప్రస్తుతం విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు నారా లోకేష్( Nara Lokesh). ఐటీ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. పరిశ్రమల శాఖను టీజీ భరత్ చూస్తున్నారు. అయినా సరే లోకేష్ వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఢిల్లీ, ముంబై తదితర నగరాలకు వెళ్లి పారిశ్రామికవేత్తలను కలిసి రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నారు. విశాఖను ఐటీ హబ్ గా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. నిన్ననే విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ లాండింగ్ స్టేషన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
ప్రత్యేక విజనరీతో..
అయితే లోకేష్ లో ఒక విజినరీ కనిపిస్తోంది. రాజకీయ విమర్శలను పక్కన పెడితే.. 16 నెలల కాలంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు విశాఖ( Visakhapatnam) జిల్లాకు వచ్చాయి. రాబోయే ఐదేళ్లలో మరిన్ని రాబోతున్నాయి. భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. జనాభాతో పాటు వాహనాల రద్దీ కూడా పెరుగుతుంది. ఆ సమయంలో ఫ్లై ఓవర్లు నిర్మించడం కాదు.. ఇప్పుడే మొదలుపెట్టి పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు వచ్చే సమయానికి విశాఖలో మౌలిక వసతులు కల్పించాలన్నది లోకేష్ లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగా క్లీన్ సిటీని టార్గెట్ చేసింది విశాఖ నగర పాలక సంస్థ. తెలంగాణకు హైదరాబాద్ ఏ విధంగా గుండెకాయ వంటిదో.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ నగరం ఆర్థిక, పారిశ్రామిక, ఐటీ రాజధానిగా మార్చేందుకు లోకేష్ ఒక లక్ష్యంతో పని చేస్తున్నారు. ఆయన చేస్తున్న కృషి మాత్రం ఇప్పుడు వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. తనకు వచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.