https://oktelugu.com/

AP Rains: వాయుగుండంగా అల్పపీడనం.. ఏపీకి భారీ హెచ్చరిక!

బంగాళాఖాతం నుంచి మరో అలెర్ట్ వచ్చింది. ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తం అయ్యింది.

Written By:
  • Dharma
  • , Updated On : November 25, 2024 / 09:29 AM IST

    AP Rains

    Follow us on

    AP Rains: ఏపీని వర్షాలు విడిచిపెట్టడం లేదు. ఒక వైపు చలి తీవ్రత పెరుగుతోంది. మరోవైపు డిసెంబర్ సమీపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో బంగాళాఖాతం నుంచి భారీ హెచ్చరిక వచ్చింది. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మారుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏపీవ్యాప్తంగా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండం గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.

    * స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం
    ప్రస్తుతం ఈ అల్పపీడనం తూర్పు హిందూ మహాసముద్రం.. దానికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోంది. అది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండం గా బలపడనుంది. రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోనంకి కూర్మనాథ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరి కోతలు జరుగుతున్న దృష్ట్యా ధాన్యం తడిసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమ జిల్లాల రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

    * శ్రీలంక వైపు?
    ఇంకోవైపు వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థిరంగా అదే పరిస్థితి కొనసాగితే ఏపీకి ముప్పు తప్పినట్టే. అయితే రాయలసీమతో పాటు కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాలపై మాత్రం ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.