AP Rain Alert: ఆంధ్రప్రదేశ్ కు వర్షాలు విడిచిపెట్టడం లేదు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చాలా జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదు అవుతున్నాయి. ఉత్తరాంధ్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ వర్షాల తీవ్రత మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వాన పడే అవకాశం ఉందని చెబుతోంది. ఈరోజు ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఏపీ ప్రజలకు అయితే భారీ హెచ్చరికలు జారీచేస్తోంది వాతావరణ శాఖ.
* ఉత్తరాంధ్రకు అలెర్ట్
ప్రధానంగా ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం పై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో నేడు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆ సమయంలో పిడుగులు పడతాయని కూడా హెచ్చరించింది.
* రికార్డు స్థాయిలో..
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు కోనసీమ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. 46 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు తెలుస్తోంది. మలికిపురంలో 36.2 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా నర్సింగోలులో 27, కాకినాడ జిల్లా డి.పోలవరంలో 25.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి. ఇంకోవైపు ఈశాన్య రుతుపవనాలు ఈనెల 16 నాటికి ప్రవేశించనున్నాయి. దీంతో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.