Andhra Pradesh rain alert: ఏపీకి( Andhra Pradesh) భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలకు అవకాశం ఉంది. ఈశాన్య అరేబియా సముద్రం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఇది ఉత్తర గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్లోని గంగా తీరం వరకు వ్యాపించి ఉంది. మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, జార్ఖండ్ మీదుగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావం ఏపీ పై కూడా పడింది. అందుకే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
Also Read: చిన్నమ్మకు బిజెపి జాతీయ పగ్గాలు?!
భారీగా గాలులు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాం( Yanam) మీదుగా నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రధానంగా ఏపీకి సంబంధించి శనివారం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో సైతం వర్షాలు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రధానంగా ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాలలో సైతం ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాలులు వీస్తాయి.
Also Read: నిరుద్యోగులకు అలెర్ట్ : మెగా డీఎస్సీ 2025 పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ప్రభుత్వాలు అప్రమత్తం..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ( Telugu States )విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రైతులు ఖరీఫ్ పనులు ప్రారంభించారు. మరోవైపు సీజనల్ వ్యాధులు సైతం ప్రబలుతున్నాయి. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమయింది. వైద్య ఆరోగ్య శాఖకు సైతం కీలక హెచ్చరికలు జారీచేసింది. ఉత్తర కోస్తా ప్రాంతంలో సముద్రం నుంచి పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తున్నాయి. అలలు ఎగసిపడుతున్నాయి. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు దూరంగా ఉన్నారు. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో మత్స్యకారులు తీరానికి పరిమితం అయ్యారు.