BJP national president: బిజెపి( Bhartiya Janata Party) జాతీయ అధ్యక్ష పదవి మహిళా నేతకు వరించనుందా? ఈసారి బిజెపి పగ్గాలు మహిళలకు కేటాయించనున్నారా? బిజెపి అగ్రనేతలు ఇదే నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ వర్గాల్లో పట్టు పెంచుకోవాలని బిజెపి అగ్ర నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా వ్యూహాత్మకంగా మహిళా నేతకు బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచనలో ఉంది. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మహిళా నాయకురాలకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. బిజెపి జాతీయ అధ్యక్ష పదవికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, ఏపీ బిజెపి మాజీ చీఫ్ పురందేశ్వరి, బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Also Read: నిరుద్యోగులకు అలెర్ట్ : మెగా డీఎస్సీ 2025 పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
జనగణన తరువాత..
వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా జనగణన ( census) ప్రారంభం కానుంది. అటు తరువాత సార్వత్రిక ఎన్నికలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మహిళా నాయకత్వం వైపు పార్టీ అగ్రనేతలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మహిళా నాయకత్వానికి కూడా ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం 2023 జనవరిలోనే ముగిసింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అదే ఏడాది జూన్ వరకు పొడిగించారు. కానీ ఇప్పటివరకు ఆయనే కొనసాగుతున్నారు. ఆయన మార్పు అనివార్యంగా మారింది. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అధ్యక్ష రేసులో ప్రముఖంగా నిర్మలా సీతారామన్ పేరు వినిపిస్తోంది.
Also Read: బిజెపి తదుపరి చీఫ్ ఎవరు? తొలి మహిళా జాతీయ అధ్యక్షురాలు రావచ్చా? రేసులో ఎవరంటే?
తరువాత పేరు ఈమెదే..
మరోవైపు దగ్గుబాటి పురందేశ్వరికి( daggupaty purandeswari ) అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెగా పురందేశ్వరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బహుభాషా వ్యాప్తంగా ఆమెకు పేరు ఉంది. గతంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఆపరేషన్ సిందూర్ పై వివరించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పంపిన అఖిలపక్ష ప్రతినిధి బృందంలో పురందేశ్వరి ఒకరు కావడం విశేషం. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి తీసుకున్న పురందేశ్వరి పార్టీని సక్సెస్ ఫుల్ గా నడిపారన్న సంతృప్తి బిజెపి పెద్దల్లో ఉంది. 2024 ఎన్నికల్లో ఏపీలో బిజెపి సీట్లతో పాటు ఓట్లు పెంచుకుంది. మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన బలాన్ని ఏపీ ఇచ్చింది. ముఖ్యంగా మిగతా రెండు రాజకీయ పక్షాలతో సమన్వయంతో ముందుకు సాగడంలో పురందేశ్వరి పాత్ర ఉంది. అందుకే పురందేశ్వరిని రెండోసారి అధ్యక్ష పదవి వరిస్తుందని అంతా భావించారు. కానీ కేంద్రమంత్రి పదవి ఇవ్వనున్నందున ఆమెకు రెండోసారి అధ్యక్ష పదవి ఇవ్వలేదని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్ష పదవి కోసం ఆమె పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి నిర్మలా సీతారామన్ ముందు వరుసలో ఉన్నారు. అనివార్య కారణాలతో ఆమెను ఎంపిక చేయకుంటే మాత్రం.. పురందేశ్వరిని పరిగణలోకి తీసుకోవడం ఖాయంగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.