Vijayawada Flood victims : ‘చుట్టూ వరద.. బయటకు వెళ్లలేని స్థితి.. రెండు రోజులుగా ఆకలి దప్పులు.. ప్రభుత్వం ఆహార పంపిణీ చేస్తున్న తమ వరకు రాని దయనీయ పరిస్థితి.ఆకలితో ఉన్న పిల్లల కడుపు నింపాలి. ఎంతటి ముంపునైనా ఎదిరించాలి. ప్రమాదమని తెలిసినా బయటకు అడుగులు వేయాలి’.. ఇది విజయవాడలోని ముంపు బాధిత ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న బాధలు. ఇంకా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు బాధపడుతూనే ఉన్నారు. రెండు రోజుల నుంచి ఆహారం, నీరు లేకపోవడంతో.. హెలికాప్టర్ కనిపిస్తే చాలు పరుగులు తీస్తున్నారు. ఆహార పొట్లాల కోసం ఎగబాకుతున్నారు. ఎటు చూసినా బురద కావడంతో.. ఆ బురదలోనే ఆహార పొట్లాలు జారవిడుస్తున్నారు. దీంతో ఆహార పొట్లాల కోసం స్థానికులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇలా బురదలో పడుతున్న ఆహారం ప్యాకెట్లను ఎంతో ఆశతో ఏరుకుంటున్నారు. ఆహారం ప్యాకెట్లు బురదమయం అయ్యాయని తెలిసినా.. కడుపు నింపుకునేందుకు తప్పదని బాధితులు వాపోతున్నారు.
* ప్రభుత్వం పటిష్ట చర్యలు
అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం అందించేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. డ్రోన్ల తో పాటు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇది ప్రధాన ప్రాంతాలకే పరిమితం అవుతుందన్న విమర్శ ఉంది. అపార్ట్మెంట్లు, భారీ భవనాలు ఉన్నచోట హెలిక్యాప్టర్ల నుంచి ఆహారాన్ని జారవిడుస్తున్నారు. కానీ మిగతా ప్రాంతాల్లో ఆహారం అందించడంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో క్రీడా స్టేడియంలో, గ్రౌండ్లలో ఆహారాన్ని విడిచి పెడుతున్నారు. అప్పుడే ఆహారం బురదమయంగా మారుతోంది. బాధితులు వాటిని దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
* శివారు ప్రాంతాల్లో అంతంతే
అయితే శివారు ప్రాంతాల్లో సహాయ చర్యలు అంతగా కనిపించడం లేదు. ఆహారం కూడా సక్రమంగా అందలేదని తెలుస్తోంది. ముఖ్యంగా చిన్నారులకు కావలసిన పాలు అందకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వారిని పట్టుకుని ప్రమాదకర స్థితిలో వరదలు దాటుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. మరోవైపు ఆహార పంపిణీ పై సైతం విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లాయి. ఈ తరుణంలో అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సహాయ చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రులకు సైతం కీలక ఆదేశాలు ఇచ్చారు.
* పురోగతి లేదు
ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. వరద కూడా తగ్గుతోంది. అయినా సరే సహాయ చర్యల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. మరోవైపు ఆహార పంపిణీ పై విమర్శలు వస్తున్నాయి. చాలాచోట్ల హెలిక్యాప్టర్ల నుంచి ఆహార పొట్లాలు విడిచి పెట్టేటప్పుడు బురదమయంగా మారుతున్నాయని.. వృధా అవుతున్నాయి అన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
హృదయ విదారక దృశ్యాలు
విజయవాడలో బురదలో ఆహార పొట్లాలు వేస్తున్న సిబ్బంది pic.twitter.com/ZdeKNfYIEq
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2024