Chandrababu : వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వ సిఫారసులు మేరకు వివిధ రాష్ట్రాలకు గవర్నర్ లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటికే ఉన్న గవర్నర్లను వివిధ రాష్ట్రాలకు సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో కొత్త వారితో భర్తీ చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. అందులో భాగంగా ఎన్డీఏ లో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. ఆ పార్టీ మద్దతుతోనే ఎన్డీఏ 3 అధికారంలోకి రాగలిగింది. అటు కేంద్రానికి అవసరమైన రాజ్యసభ స్థానాలను సైతం టిడిపి సర్దుబాటు చేస్తోంది. అందులో భాగంగానే ఆర్. కృష్ణయ్యకు బిజెపి తరఫున రాజ్యసభకు పంపించింది టిడిపి. అదే క్రమంలో గవర్నర్ పోస్టులు ఖాళీ కావడంతో.. ఒక పదవిని టిడిపికి ఆఫర్ చేసింది బిజెపి. దీంతో తెలుగుదేశం పార్టీ ఆ పదవి ఎవరికి ఇస్తుంది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
* ఆశావహులుగా ఆ ఇద్దరు
తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇద్దరు నేతలు గవర్నర్ పోస్ట్ ను ఆశిస్తున్నారు. ఇద్దరూ పార్టీ సీనియర్లే. టిడిపి ఆవిర్భావం నుంచి ఉన్నవారే. ఒక విధంగా చెప్పాలంటే టిడిపి వ్యవస్థాపక సభ్యులు కూడా. అందులో ఒకరు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. ఈ ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన బదులు కుమార్తె అదితి గజపతిరాజును ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించుకున్నారు. అయితే సీనియర్ గా ఉన్న అశోక్ గజపతిరాజుకు తగిన పదవి ఇస్తారని ప్రచారం నడిచింది. ముఖ్యంగా టీటీడీ ట్రస్ట్ పోర్టు చైర్మన్ పదవిలో కూర్చోబెడతారని టాక్ నడిచింది. అయితే అందుకు అశోక్ గజపతిరాజు విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఆయన చూపు గవర్నర్ పోస్ట్ పై ఉందన్నది ఒక ప్రచారం. ఆ పదవితో గౌరవప్రదమైన పదవీ విరమణ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* యనమల సైతం ఆశలు
మరోవైపు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా సీనియర్ మోస్ట్ లీడర్. టిడిపి ఆవిర్భావం నుంచి ఆయన పని చేస్తూ వచ్చారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి ఆయనకు మంత్రి పదవి దక్కుతూ వచ్చింది. టిడిపిలో సంక్షోభ సమయంలో చంద్రబాబుకు అండగా నిలబడ్డ నేతల్లో యనమల ఒక్కరు. అందుకే చంద్రబాబు తన మూడు క్యాబినెట్లలో యనమలకు కీలక శాఖ అప్పగించారు. ఆయనకి ఆర్థిక శాఖ అప్పగించి.. కీలక స్థానంలో కూర్చోబెట్టారు. ఎమ్మెల్సీగా ఉన్న సందర్భాల్లో సైతం మంత్రిని చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. తన బదులు కుమార్తెను బరిలో దించి ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు గవర్నర్ పోస్ట్ పై సైతం ఆయన ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ఇద్దరూ నేతల్లో ఎవరికి చంద్రబాబు అవకాశం ఇస్తారో చూడాలి.