Pawankalyan : వైసీపీ సోషల్ మీడియా కోడై కూసింది. జనసేన గుర్తు గాజుగ్లాసును కాకి ఎగురేసుకుపోయిందని సెటైర్ వేసింది. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు.. కింది స్థాయి కార్యకర్త నుంచి మంత్రుల వరకూ అందరిదీ అదే పంథా. గాజు గ్లాసు గుర్తుపోయింది. మీరా మాట్లాడేది అంటూ విమర్శల పరంపర కొనసాగించారు. కానీ వాటన్నింటికీ చెక్ చెబుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం వెలువరించింది. జనసేన పార్టీకి గాజుగ్లాస్ గుర్తును రిజర్వ్ చేసింది. రాష్ట్ర పార్టీగా గుర్తించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి కామన్ సింబల్ గా గాజుగ్లాస్ గుర్తును కేటాయించనుంది. దీంతో వైసీపీ ప్రచారానికి తెరపడింది. ఏదో జరుగుతుందని ఆశిస్తే.. ఇలా జరిగిందేమిటి? అని అధికార పార్టీ నేతలు తెగ బాధపడుతున్నారు.
ఇటీవల ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీ ఫ్రీ సింబల్స్ జాబితాను ప్రకటించింది. అందులో జనసేన గాజు గ్లాసును చేర్చింది. జనసేన పోటీ ఉన్నచోట కచ్చితంగా గాజుగ్లాసునే కేటాయిస్తుంది. పోటీలేని చోట ఇండిపెండెంట్లకు కేటాయించే అవకాశం ఉంది. అది జనసేన అభ్యంతరం పెడితే ఇవ్వకపోవచ్చు కూడా. అయితే అసలు జనసేనకు గాజు గ్లాసు గుర్తే పోయిందంటూ వైసీపీ బ్యాచ్ ప్రచారం చేయడం ప్రారంభించింది. అసలు విషయం తెలిసినా జనసేనను ప్రజల్లో బలహీనం చేయాలని ప్రయత్నించింది. కానీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చక్రం తిప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మిత్రపక్షం జనసేనకు అండగా నిలిలిచినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నియామకాల్లో కూడా సర్కారుదే తుది నిర్ణయం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ సిఫారసులకే పెద్దపీట వేస్తోంది. అటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘమే జనసేన గాజుగ్లాసు గుర్తును రిజర్వ్ చేయడం వెనుక జాతీయ ఎన్నికల కమిషన్ ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలు ప్రచారం చేసినట్టే జనసేన గుర్తును దూరం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ కేంద్రం అడ్డుకట్ట వేసింది. అభ్యంతరాలు చెప్పడంతో వైసీపీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో జనసేనకు కేంద్రం పుష్కలంగా అండదండలు అందించడం విశేషం.
అయితే అంతకంటే ముందే వైసీపీ తప్పుడు ప్రచారానికి జన సైనికులు చెక్ చెప్పారు. తమ పార్టీకి గుర్తుతో పనేమిటని ప్రశ్నించారు. . మా పార్టీ గుర్తు పవన్ కళ్యాణ్ అని చాటిచెప్పారు. పవన్ ను చూసి ప్రజలు తమకు ఓట్లు వేస్తారని ఎలుగెత్తి చాటారు. గుర్తుపోతే తాము బాధపడాలి కానీ.. వైసీపీ మంత్రులు, నేతలు తెగ బాధపడిపోవడం చూసి జాలేస్తోందని సెటైర్లు వేశారు. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చూసి ఖుషీ అవుతున్నారు. త్వరలో జాతీయ ఎన్నికల సంఘం కూడా గుర్తును ప్రకటిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో జనసేన తన గాజుగ్లాసు గుర్తును కాపాడుకుందన్న మాట.