TTD ghee adulteration case: గత కొన్ని రోజులుగా టీటీడీ లడ్డు కు సంబంధించి.. నెయ్యి కల్తీ వ్యవహారం దుమారం రేపింది. దీనిపై సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ తరుణంలో నెయ్యి కల్తీ కి బాధ్యులైన వారిపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. అయితే ఇందులో సూత్రధారులు, పాత్రధారుల విషయంలో భిన్న వైఖరులు ఉన్నాయి. ఇంతవరకు ఈ కేసు విచారణలో భాగంగా అధికారులు, కిందిస్థాయి ఉద్యోగుల వరకు విచారణ సాగింది. ఇకనుంచి నిర్ణయాత్మక అధికారాలు ఉండి, టీటీడీలో ప్రభావితం చేయగలిగిన వ్యక్తులపై విచారణకు ఏకసభ్య కమిషన్ ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. విశ్రాంత ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో విచారణ చేపట్టనుంది.
చార్జ్ షీట్ దాఖలు..
నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటయింది ప్రత్యేక దర్యాప్తు బృందం. తప్పు చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని తన చార్జ్ షీట్లో పేర్కొంది. అయితే కేవలం అధికారుల పాత్ర వరకు తేల్చింది సిట్. పైగా నిందితుల పేర్లను ప్రస్తావిస్తూ చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో అసలు సూత్రధారులను, టీటీడీ నిర్ణయాత్మక శక్తిగా ఉండే వారి పాత్ర విచారణకు గాను ఈ ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. లోపాలు, వైఫల్యాలు, తప్పులకు కారకులైన కమిటీ సభ్యులు, సీనియర్ అధికారులపై తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసేందుకు ఈ ఏకసభ్య కమిషన్ను నిర్మించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
45 రోజుల్లో నివేదిక..
కొత్తగా ఏర్పాటు అయిన ఈ ఏకసభ్య కమిషన్ 45 రోజుల్లోపు తమ నివేదికను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు అన్ని విధాల సహకరిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల వల్ల కోర్టు ముందు పెండింగ్లో ఉన్న ఏ చర్యలకు భంగం కలగదని ప్రభుత్వం ఉత్తరవుల్లో స్పష్టం చేయడం విశేషం. వైసిపి హయాంలో నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై ఏర్పాటయింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అసలు నెయ్యే కానీ దాన్ని నెయ్యి పేరిట సరఫరా చేశారని ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చేసింది. పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్ తో సిద్ధం చేసిన పదార్థాన్ని నెయ్యి ముసుగులో సరఫరా చేశారని పేర్కొంది. దానికి నెయ్యి సువాసనలు వచ్చేలా చేసేందుకు బీటా కెరోటిన్ లాంటి రసాయనాలు కలిపారని తేల్చింది. ఈ ఐదు సంవత్సరాల్లో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని వెల్లడించింది. ఏకంగా 20 కోట్ల శ్రీవారి లడ్డూలను అదే నెయ్యితో తయారు చేశారని తెలిపింది. అయితే ఇప్పటివరకు దిగువ స్థాయి అధికారులు, సిబ్బంది పాత్రను తేల్చింది సిట్. సూత్రధారుల మూలాలను సైతం గుర్తించింది. అయితే ఇప్పుడు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారో.. ఏక సభ్య కమిషన్ తేల్చనుంది.