Ganta Srinivas Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు( ganta Srinivas Rao ) వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. 2024 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు గంటా శ్రీనివాసరావు. మంత్రి పదవి ఆశించారు. కానీ వివిధ సమీకరణల్లో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. అయినా సరే తన పని తాను చేసుకు పోతున్నారు. ఈ తరుణంలో ఇటీవల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణపై ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్కెల్ అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. అయితే అది చాలాదన్నట్టు ఇప్పుడు విశాఖ విమాన సర్వీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో హై కమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Also Read: పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మధ్య గ్యాప్ రోజురోజుకి పెరిగిపోతుందా..?
* సానుకూలత వస్తున్న తరుణంలో..
తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు( kinjarapur Ram Mohan Naidu ) పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎప్పటికప్పుడు పనుల పర్యవేక్షణ కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సీప్లేన్ ల ఏర్పాటు, అంతర్జాతీయ విమాన సర్వీసులు, ఇతరత్రా వసతులు ఏర్పాటు చేయడంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి ఉంది. విమానయాన సేవలో అంతటా సానుకూలత కనిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. విమాన సర్వీసులు, సేవలపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వివాదాస్పదంగా మారడంతో పార్టీ హై కమాండ్ స్పందించినట్లు తెలుస్తోంది.
* విమాన సర్వీసులపై ఆందోళన..
గంటా శ్రీనివాసరావు విజయవాడ( Vijayawada) వచ్చేందుకు హైదరాబాదు వెళ్లాల్సి వచ్చింది. విశాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక రాజధానిగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో విశాఖ నుంచి విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా రద్దవుతుండడంతో ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడుతుందని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. విశాఖ నుంచి అమరావతికి విమానంలో వెళ్లాలంటే హైదరాబాద్ మీదుగా ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. సిఐఐ, ఫిక్కీ తదితర సంస్థలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులు విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చి.. అక్కడి నుంచి విజయవాడ చేరుకుంటున్నారని వివరించారు. మంగళవారం వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో తాను రెండు విమానాలు మారాల్సి వచ్చిందని తెలిపారు. విశాఖలో విమాన ప్రయాణికులకు ఎందుకు ఈ దుస్థితి అంటూ గంటా ఆవేదన వ్యక్తం చేశారు. తన ట్వీట్ ను సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేశారు.
* తీరు సరి కాదంటూ..
సోషల్ మీడియాలో( social media) గంటా శ్రీనివాసరావు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. దీనిపై పార్టీ హై కమాండ్ స్పందించింది. పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ సమస్యపై స్పందించే తీరు సరికాదని మందలించింది. ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని.. ఇలా సోషల్ మీడియాలో పోస్టులు ఏంటని నిలదీసినట్లు సమాచారం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి టిడిపికి చెందిన వారేనన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. ప్రస్తుతం ఇదే రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది.
Also Read: జగన్ ని వ్యతిరేకిస్తావా? పోలీస్ అధికారికి బెదిరింపులు!