Free bus travel: ఏపీలో( Andhra Pradesh) మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి కసరత్తు ప్రారంభం అయ్యింది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ పథకాల్లో సైతం ఈ పథకానికి చోటిచ్చారు. ఇప్పుడు వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో.. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దీనిపై స్వయంగా సీఎం చంద్రబాబు కూడా ప్రకటన చేశారు. స్థానిక ప్రామాణికతగా జిల్లాలో పల్లె వెలుగుతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై అనేక అభ్యంతరాలు, ప్రశ్నలు వస్తున్నాయి.
అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా హామీ..
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు జిల్లాల వరకే పరిమితం చేయడంతో అభ్యంతరాలు వస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక తో పాటు తెలంగాణలో ఈ పథకం అమలవుతోంది. ఆ రెండు చోట్ల రాష్ట్ర సరిహద్దుల వరకు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తూ వచ్చారు. కానీ ఏపీలో అందుకు భిన్నంగా జిల్లాలకు పరిమితం చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఉచిత ప్రయాణ పథకం వర్తింపజేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
Also Read: పాఠం చెప్పిన చంద్రబాబు.. శ్రద్ధగా విన్న లోకేష్!
ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా..
అయితే ప్రస్తుతం సంక్షేమ పథకాలు( welfare schemes) ప్రారంభం అయ్యాయి. అదే సమయంలో అభివృద్ధి పనులతో పాటు అమరావతి రాజధాని నిర్మాణం కూడా ప్రారంభం అయింది. ఈ తరుణంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని జిల్లాలకు పరిమితం చేసింది. అయితే ఈ విషయంలో విపక్షాల నుంచి ఎదురుదాడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేయాలన్న డిమాండ్ వినిపించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సన్నాహాలు చేస్తోంది.