AP Free bus effect: ఏపీలో స్త్రీ శక్తి పథకం( sthree Sakthi scheme ) కింద మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం అయింది. ఆగస్టు 15న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వయంగా బస్సులో ప్రయాణించి పథకానికి శ్రీకారం చుట్టారు. ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అందుతోంది. రోజుకు లక్షలాదిమంది ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ప్రధానంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ లలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించడంతో ఆ బస్సులు రద్దీగా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రీమియర్ సర్వీసులైన నాన్ స్టాప్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి. ఉచిత ప్రయాణ పథకంతో ఒకేసారి బస్సుల్లో రద్దీ పెరగడంతో.. సీట్ల కోసం మహిళల మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల ఘర్షణకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి వైరల్ అవుతున్నాయి.
ఆ రెండు రాష్ట్రాల్లో..
గతంలో కర్ణాటక తో( Karnataka) పాటు తెలంగాణలో సైతం ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించాయి అక్కడి ప్రభుత్వాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అక్కడ ఆ ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ప్రారంభంలో ఆ రాష్ట్రాల్లో సైతం ఇటువంటి పరిస్థితి కనిపించింది. ప్రయాణికుల మధ్య ఘర్షణ, ఆర్టీసీ సిబ్బందితో మహిళల వాగ్వాదం, చేయి చేసుకోవడం వంటి పరిణామాలు ఎదురయ్యాయి. అయితే ఎన్నికల హామీలో భాగంగా ఏపీలో సైతం ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఉచిత ప్రయాణ పథకాన్ని మంత్రుల సబ్ కమిటీ అధ్యయనం చేసింది. అక్కడ ఉచిత ప్రయాణ పథకంలో ఎదురైన పరిణామాలన్నింటినీ ఒక నివేదిక రూపంలో ఇచ్చింది క్యాబినెట్ సబ్ కమిటీ. అందుకు అనుగుణంగా ఐదు రకాల సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. మహిళల రద్దీ, వారికి భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రారంభం కావడంతో ఇక్కడ కూడా గందరగోళం నెలకొంది. సీట్ల కోసం మహిళల మధ్య ఘర్షణ జరుగుతోంది.
వైసిపి ట్రోల్స్..
ఇప్పటికే మహిళల ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి వైసిపి సోషల్ మీడియా( social media) వేదికగా అనేక రకాల ప్రచారానికి తెరతీసింది. అన్ని రకాల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తుంది. కేవలం తక్కువ దూరం ప్రయాణించే బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ఏంటని ప్రశ్నిస్తోంది. ఇప్పుడు బస్సులలో ఘర్షణ జరుగుతుండడంతో.. సరిపడ బస్సులు వేయడం లేదని కొత్త ఆరోపణలతో ప్రచారం చేయడం ప్రారంభించింది. అయితే ఇంకా వారం రోజులు తిరగకముందే ఉచిత ప్రయాణ పథకం పై నెగిటివ్ ప్రచారం జరుగుతుండడం విశేషం.
AP free bus = free ride + free fight https://t.co/RXWbpM5Q0V pic.twitter.com/48R6C7zLGT
— FREDDY (@Fr9ddyy) August 18, 2025