AP Rains : విజయవాడలో నలుగురు.. గుంటూరులో ముగ్గురు.. ఏపీలో విషాద వర్షాలు.. రెడ్ అలెర్ట్!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీగా వర్షాలు పడుతున్నాయి. ఏపీలో వివిధ ఘటనల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు.

Written By: NARESH, Updated On : August 31, 2024 8:42 pm

Four died in Vijayawada, three in Guntur due to tragic rains in AP

Follow us on

AP Haevy  Rains : ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. మరో రెండు రోజులపాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి తీవ్ర రూపం దాల్చుతుందని స్పష్టం చేసింది. అయితే ఏపీవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు కొన్ని చోట్ల విషాదాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరులో కొండ పోత వర్షం పడుతోంది. దీంతో నగర ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. గుంటూరు జిల్లా ఉప్పలపాడు లో విషాదం చోటు చేసుకుంది. వరద ఉధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. స్కూల్ టీచర్ తో సహా ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులను రాఘవేంద్ర, సాత్విక్, మాణిక్ గా గుర్తించారు. దీంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

* పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా
మంగళగిరి మండలం ఉప్పలపాడు కు చెందిన నడుంపల్లి రాఘవేంద్ర నంబూరు లోని ఓ స్కూల్లో మాథ్స్ టీచర్ గా పనిచేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తరగతులు ముగిసిన వెంటనే ఇంటికి బయలుదేరే సమయంలో భారీ వర్షం పడింది. అదే పాఠశాలలో చదువుతున్న ఉప్పలపాడు కు చెందిన పసుపులేటి సాత్విక్, కోడూరు మాన్విత్ అనే ఇద్దరు విద్యార్థులను తన కారులో ఎక్కించుకొని బయలుదేరారు. ఉప్పలవాడు సమీపంలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వారు ప్రయాణిస్తున్న కారు కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా వరద ఉధృతికి వీలు లేకుండా పోయింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

* కాపాడే ప్రయత్నం చేసినా
స్థానికులు తాళ్ల సాయంతో కారును కాలువలో నుంచి బయటకు తీశారు. అప్పటికే వారు చనిపోయారు. కారులో నుంచి టీచర్ తో పాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. అయితేరాష్ట్రంలో వర్షాల ఉధృతి దృష్టి ఏడు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అందులో గుంటూరు కూడా ఉంది. కానీ వీరు చదువుతున్న పాఠశాలను ఎందుకు నిర్వహించారో అర్థం కావడం లేదు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

* కొండ చరియలు విరిగిపడి
విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొగల్రాజపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఒక బాలిక, ఇద్దరు మహిళలు ఉన్నారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేపడుతోంది. మరోవైపు కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో స్థానికులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా కొండ చర్యలు విరిగి పడుతుండడంతో విజయవాడ దుర్గా గుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గగుడి పై వంతెనను కూడా తాత్కాలికంగా మూసివేశారు.

* ప్రకాశం బ్యారేజీకి వరద
గుంటూరు, విజయవాడ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. దీంతో బ్యారేజ్ మొత్తం 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీకి 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు.

* రైళ్ల రద్దు
భారీ వర్షాల నేపథ్యంలో పలుమార్గాల్లో రైళ్లు రద్దు అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ మీదుగా వెళ్లాల్సిన రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భద్రతా కారణాల రీత్యా వీటిని రద్దు చేసినట్లు ప్రకటించింది. శని, ఆది, సోమవారాల్లో 20 వరకు రైళ్లు రద్దు అయ్యాయి. విజయవాడ- తెనాలి, విజయవాడ -గూడూరు, తెనాలి- రేపల్లె, గుడివాడ- మచిలీపట్నం, భీమవరం- నిడదవోలు, గుంటూరు -రేపల్లె, విజయవాడ మచిలీపట్నం, విజయవాడ ఒంగోలు తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేశారు.