DPL T20 : ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు.. ఐపీఎల్ లో ఇతడి పై కనకవర్షమే..

2008లో ఏ ముహూర్తాన ఐపీఎల్ ప్రారంభమైందో తెలియదు గాని.. అది క్రికెట్ చరిత్రను సమూలంగా మార్చింది. మన దేశం నుంచి మొదలుపెడితే దక్షిణాఫ్రికా వరకు పొట్టి క్రికెట్ టోర్నీలు నిర్వహించేందుకు కారణమైంది. ఈ టోర్నీల ద్వారా క్రికెటర్లకు చేతినిండా సంపాదన ఉంటోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 31, 2024 9:03 pm

Priyansh Arya

Follow us on

DPL T20  : ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఈ టోర్నీలో ప్రియాన్ష్ ఆర్య అనే ఆటగాడు సత్తా చాటుతున్నాడు.. ఈ టోర్నీలో ఇప్పటివరకు అతడు దుమ్ము రేపాడు. అదరగొట్టే ఇన్నింగ్స్ ఆడి భవిష్యత్తు ఆశాకిరణం లాగా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడిన ఇతడు న భూతో న భవిష్యత్ అనే స్థాయిలో ఇన్నింగ్స్ ఆడాడు. 57(30, 82(51), 53(32), 45(26), 107*(55), 88(42), 24(9) ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు. తాజాగా మరో శతకం కొట్టాడు. శనివారం నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ జట్టుపై 50 బాల్స్ లో 120 రన్స్ కొట్టాడు. ముఖ్యంగా మనన్ భరద్వాజ్ వేసిన పన్నెండో ఓవర్ లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో అనితర సాధ్యమైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్న ప్రియాన్ష్.. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు సింహ స్వప్నం లాగా మారాడు. ఒకవేళ ఇతడు ఐపీఎల్ వేలంలో పాల్గొంటే కనకవర్షం కురవడం ఖాయం. ప్రియాన్ష్ 2019లో అండర్ 19 లో ఇండియా – ఏ జట్టు తరఫున యశస్వీ జై స్వాల్, రవి బిష్ణోయ్ తో కలిసి ఆడాడు.

మరోవైపు ఈ మ్యాచ్ లో ఆయుష్ బదోని (165: 55 బంతుల్లో 8 ఫోర్లు, 19 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తో అలరించాడు. బదోని దక్షిణ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వీరిద్దరూ చెలరేగి ఆడటంతో 20 ఓవర్లలో ఆ జట్టు రికార్డు స్థాయి స్కోర్ సాధించింది. ఐదు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. టి20 క్రికెట్ చరిత్రలో ఇది రెండవ అత్యధిక స్కోరు. మంగోలియా జట్టుపై జరిగిన ఓ మ్యాచ్లో నేపాల్ జట్టు 314/3 స్కోర్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. బదోని, ప్రియాన్ష్ ద్వయం కేవలం 99 బంతుల్లోనే 286 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పింది.

టి20 క్రికెట్ చరిత్రలో ఇదే హైయెస్ట్ పార్ట్ నర్ షిప్. బదోని ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో జట్టుకు ఆడుతున్నాడు.. ప్రియాన్ష్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు కొట్టడంతో నెట్టింట అతడి గురించి చర్చ మొదలైంది. ట్విట్టర్ ఎక్స్ లో అతడు ఒక్కసారిగా ట్రెండింగ్ పర్సన్ అయిపోయాడు . అతడు ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టిన వీడియోను ఢిల్లీ ప్రీమియర్ లీగ్ యాజమాన్యం తన అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా.. లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే సాగుతోంది.