Gudivada Amarnath Supported KCR: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఎప్పటికప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకుంటోంది. ముఖ్యంగా కెసిఆర్ తో స్నేహం ఆ పార్టీకే నష్టం. ఎందుకంటే కెసిఆర్ ఏపీ తో పాటు ఏపీ ప్రజలను తిట్టారు. ఈ ప్రాంతాన్ని నిత్యం అవమానిస్తూనే ఉండేవారు. అయితే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు కెసిఆర్ తో చేతులు కలిపారు జగన్మోహన్ రెడ్డి. దాని పర్యవసానాలు మొన్నటి ఎన్నికల్లో చూశారు. గెలుపులో స్నేహితుడు కనిపిస్తాడు కానీ.. ఓటమిలో మాత్రం స్నేహితుడిపై వ్యతిరేకత సైతం పనిచేస్తుంది. మొన్న జగన్ మోహన్ రెడ్డి విషయంలో జరిగింది అదే. తెలంగాణలో తన స్నేహితుడు సెంటిమెంట్ ద్వారా గెలవాలని భావించి నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై పోలీసుల దండయాత్రకు ఆదేశాలు ఇచ్చారు. కానీ అప్పటికే తెలంగాణ ప్రజలు ఫిక్స్ అయ్యారు. కెసిఆర్ ను ఓడించారు. ఏపీ ని తిట్టిన నేతతో స్నేహం చేసిన జగన్మోహన్ రెడ్డికి సైతం ఓటమి దెబ్బ చూపించారు.
* టిడిపి నేతల మౌనం..
తాజాగా మీడియా ముందుకు వచ్చారు కెసిఆర్( KCR). గులాబీ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి వస్తున్న పెట్టుబడులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై సెటైరికల్ గా మాట్లాడారు. చంద్రబాబు అసమర్ధ నాయకుడు అన్నట్టు వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించాలి. కెసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడాలి. కానీ టిడిపి నేతలు వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు కోసం కేసీఆర్ ఎంతలా మాట్లాడితే అంత సానుభూతి ఏపీలో లభిస్తుంది. ఇన్నాళ్లు తెలంగాణలో కేసీఆర్ ఆడిన గేమ్ ఇప్పుడు టిడిపి నేతలు ఏపీలో ఆడుతున్నారు. అయితే ఈ విషయం తెలియని వైసిపి నేతలు ఆ ట్రాప్ లో పడ్డారు. ఏకంగా కెసిఆర్ కు గుడ్ కాండాక్ట్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇది ఎంత మాత్రం ఆ పార్టీకి ప్లస్ కాదు. ఏకంగా మైనస్.
* ఏపీ పెట్టుబడులపై కామెంట్స్.. చంద్రబాబు( Chandrababu) పెట్టుబడులంటే వంట మనుషులతో అంటూ ఎద్దేవా చేశారు కేసీఆర్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు చేసే క్రమంలో చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు. చంద్రబాబు శిష్యుడు రేవంత్ అంతకంటే ఏం చేయగలరు అంటూ కెసిఆర్ ఎద్దేవా చేశారు. ఆ మాట పట్టుకొని ఇప్పుడు వైసీపీ మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ కేసిఆర్ ను సమర్ధించారు. ఆయన చంద్రబాబును తిట్టారు కాబట్టి వైసిపి నేతలకు ఆనందంగా ఉంది. చంద్రబాబు విషయంలో కెసిఆర్ చెప్పింది నిజమేనంటూ చెప్పుకొచ్చారు. కెసిఆర్ అబద్ధం ఎప్పుడు చెప్పరు అని సర్టిఫికెట్ ఇచ్చారు. తద్వారా ఏపీలో మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు చర్చకు దారి తీసింది. ఆయన అన్నది ఏపీ పెట్టుబడులపై. ఆపై ఏపీ సీఎం చంద్రబాబుపై దారుణంగా వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే ఏపీకి భారీగానే పెట్టుబడులు వస్తున్నాయి. దానిని సహించుకోలేక కేసీఆర్ అలా మాట్లాడుతున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దానిని అందిపుచ్చుకుంది. తద్వారా ఏపీ ప్రజల్లో విలన్ గా మారింది. రాష్ట్రంపై మాట్లాడుతున్న కెసిఆర్ ను సమర్ధించడం ద్వారా తన దుర్బుద్ధి ని బయటపెట్టింది వైసిపి.