KCR: సుదీర్ఘకాలం వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన కెసిఆర్ ఆదివారం ఒక్కసారిగా తెలంగాణ భవన్ కు వచ్చారు. ఈసారి ఏకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద చాలాసేపు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక రకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వ్యవహారంలో చిక్కుముడులు ఏర్పడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అనటుగా విమర్శలు చేశారు. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో కెసిఆర్ చాలా విషయాలను మరుగున పడేశారు. ఒక రకంగా గుడ్డను కాల్చి మీద వేసే సామెతను అమలులో పెట్టారు.
ఈ ప్రాజెక్టుకు మొదట్లో భూసేకరణ అనేది కీలకమైన సమస్యగా ఉండేది.. ఆ తర్వాత డిపిఆర్ ను కేంద్రం వాపస్ పంపించింది. ఇది కూడా గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. ఆ తర్వాత నీటి కేటాయింపులు అంశం కూడా తీవ్రమైన సమస్యగా మారింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతుల విషయంలో మొదటి నుంచి కూడా గులాబీ పార్టీ నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. 2014లో గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 8 సంవత్సరాల కాలయాపన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ (డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్) ను సీడబ్ల్యూసీ కి అందజేసిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. నడు గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 40 టీఎంసీల ప్రతిపాదనలను రూపొందించింది. మిగులు జలాల లెక్కల పై మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు కేంద్రానికి క్లారిటీ ఇవ్వలేదు. మొన్నటి విలేకరుల సమావేశంలో మరో 45 టీఎంసీల నీరు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేటాయింపులు అని చెప్పిన కేసీఆర్.. గతంలో ఈ వాదనలు కేంద్రం ముందు ఎందుకు వాదించలేదనేది సాగునీటి రంగ నిపుణుల ప్రశ్న.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. 8 సంవత్సరాల పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను గులాబీ పార్టీ పట్టించుకోలేదు. 2022 సెప్టెంబర్ 13న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డి పి ఆర్ ను సెంట్రల్ వాటర్ కమిషన్ కు సమర్పించింది. ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరింది. అయితే ఈ డి పి ఆర్ లో కొన్ని విషయాలపై సెంట్రల్ వాటర్ కమిషన్ క్లారిటీ కోరింది. అదే కాదు ప్రాజెక్టు కేటాయింపులపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. నాటి ప్రాజెక్టు నిర్మాణంలో 90.8 టీఎంసీల జలాలను కేటాయించారు. అయితే ఇందులో 45.66 టిఎంసిలను మైనర్ ఇరిగేషన్ లో ఆదాచేసిన జలాలుగా రాష్ట్ర ప్రభుత్వం సి డబ్ల్యూ సి కి చూపించింది. మిగతా 45 టీఎంసీల నీటిని గోదావరి డైవర్షన్ ద్వారా ఎగువన వాడుకుంటామని చెప్పింది.
ఈ నీటి అంశంపై ఇంకా కొన్ని విషయాలు తేలలేదని అప్పటి గులాబీ పార్టీ ప్రభుత్వానికి సిడబ్ల్యుసి లెటర్ కూడా రాసింది. మైనర్ ఇరిగేషన్ లో ఆదా చేసే 45 టీఎంసీలకు లెక్కలు లేవని.. గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీల వ్యవహారం పెండింగ్లో ఉందని పేర్కొంది. 2023 ఏప్రిల్ 4న డిపిఆర్ ను మళ్లీ వెనక్కి పంపింది.. ఆ లెటర్లో కేవలం మౌఖికపరమైన వివరాల మాత్రమే కేంద్రానికి తెలియజేశారని.. స్పష్టమైన ఆధారాలు సమర్పించలేదని సిడబ్ల్యుసి పేర్కొంది. ఎన్నిసార్లు అడిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్నించి స్పందన లేకపోవడంతో గత ఏడాది డిసెంబర్లో డిపిఆర్ ను అప్రైజల్ లిస్టు నుంచి తప్పించింది. అంతేకాదు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తయ్యే వరకు గోదావరి డైవర్షన్ ప్రస్తావన తీసుకురావద్దని సూచించింది. మైనర్ ఇరిగేషన్ జలాల ఆదా ఎలా అవుతుందో ఫార్మాట్ ప్రకారం ఇస్తేనే తాను మళ్ళీ అప్రైజల్ లిస్టులో పెడతామని స్పష్టం చేసింది.
పాలమూరు రంగారెడ్డిని అప్రైజల్ లిస్టు నుంచి తప్పించడంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి, అధికారులు పలుమార్లు వాదనలు వినిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రేవంత్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి అనేక పర్యాయాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వ్యవహారంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిని ఖండించిన కేంద్రం.. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో కేటాయింపులు పూర్తయ్యే వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది. అంతే కాదు 2024 జనవరి 29న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిడబ్ల్యుసి క్లారిటీ ఇచ్చింది.