Prakasham Barrage : ప్రకాశం బ్యారేజీ గేట్లు డ్యామేజీ వెనుక కుట్ర కోణం ఉందా? కావలిసే పడవలను వదిలేశారా? ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని భావించారా? ఈ విద్రోహ చర్య వెనుక వైసిపి ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానది రికార్డు స్థాయిలో ప్రవహించిన సంగతి తెలిసిందే. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తింది. ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 72 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడిచిపెట్టారు. అయితే పై ప్రాంతం నుంచి పడవలు వచ్చి ఢీకొట్టడంతో గేట్లు దారుణంగా దెబ్బతిన్నాయి.దీంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.అయితే పడవలు వరదల్లో కొట్టుకుని వచ్చి ఉంటాయని అంతా భావించారు. కానీ ఇది విద్రోహ చర్యగా తాజాగా వెల్లడయ్యింది. ప్రస్తుతం వరదలు తగ్గడంతో పడవలు బయటపడ్డాయి. అయితే పడవలపై వైసీపీ రంగులు ఉండడంతో.. ఆ పార్టీ నేతల పని అని తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
* భారీగా ఇసుక డంప్
కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వైసీపీ నేతలు భారీగా ఇసుక డంప్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా మాజీ ఎంపీ నందిగాం సురేష్ పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఒక నిందితుడు. ఇటీవల హైకోర్టు వారికి ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడంతో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక పోలీస్ బృందం సురేష్ ని అరెస్టు చేసింది. ఆయన పోలీస్ అదుపులో ఉండగానే ప్రకాశం బ్యారేజీ వద్ద కొట్టుకొచ్చిన పడవలు ఆయనవేనని తేలింది. దీంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగిసుకునే అవకాశం ఉంది.
* చాలా దూకుడు
వైసిపి హయాంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ చాలా దూకుడుగా ఉండేవారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి వ్యూహరచన చేసింది ఆయనేనని ఆరోపణలు ఉన్నాయి.అందుకే కూటమి ప్రభుత్వం పట్టు పట్టి మరి సురేష్ పై టార్గెట్ చేసింది. ఇతర ప్రాంతాలకు పారిపోవాలని చూసినా విడిచి పెట్టలేదు. హైదరాబాద్ వెళ్లి మరి అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కి గుర్తుకొచ్చిన పడవలు ఆయనవేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తు మరింత ముమ్మరం చేయమన్నారు.
* నేతల అరెస్టులు
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్ట రాజ్యంగా వ్యవహరించిన నేతలను విడిచి పెట్టకూడదని కూటమి ప్రభుత్వం డిసైడ్ అయింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో ఇప్పటికే నందిగాం సురేష్ అరెస్టయ్యారు. లేళ్ల అప్పిరెడ్డి,తలశీల రఘురాం, దేవినేని అవినాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పుడు నందిగాం సురేష్ కు చెందినవిగా భావిస్తున్న పడవలు ప్రకాశంబ్యారేజీ గేట్లను దెబ్బతీశాయి. ఉద్దేశ పూర్వకంగా పడవలను విడిచిపెట్టారా? లేకుంటే గతంలో తీరంలో ఉన్నది కొట్టుకు వచ్చాయా?అన్నది దర్యాప్తులో తేలనుంది.