Film industry : తమిళనాడులో ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే.. అక్కడి సినీ ఇండస్ట్రీ మొత్తం ఒకే తాటిపైకి వస్తుంది. తమవంతుగా సహాయం చేస్తుంది. కేరళ, కర్ణాటక రాష్ట్రాలలోనూ ఇదే సంప్రదాయం కొనసాగుతుంది. కానీ అదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయాలకు వచ్చేసరికి ఆ స్ఫూర్తి కనిపించడం లేదు. ఇటీవల వరదలకు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు.. అయితే అందులో కొంతమంది మాత్రమే స్పందించారు. మిగతావారు మాకెందుకులే అని ఊరుకున్నారు. వాస్తవానికి సమాజం ఇంతటి కష్టాల్లో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ చెందినవారు ఆదుకోవడానికి ముందుకు రావాలి. ఎందుకంటే ఈ సమాజం వారికి చాలా ఇచ్చింది.
ఇటీవల కురిసిన వర్షాలకు ఏపీలో విజయవాడ నగరం సర్వనాశనమైంది. గతంలో ఎన్నడూ లేనంతగా వరదలు రావడంతో విజయవాడ నగరం దాదాపుగా మునిగిపోయింది. కృష్ణానది చరిత్రలో కనివిని ఎరుగని స్థాయిలో వరద వచ్చింది. ఇంతటి వరద ఉధృతిని ఎన్నడూ చూడలేదని విజయవాడ వాసులు చెబుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షాల వల్ల, సంభవించిన వరదల వల్ల విజయవాడలో భారీగా ప్రాణ నష్టం చోటుచేసుకుంది. సుమారు 50 మంది దాకా ఈ వర్షాల వల్ల చనిపోయారు. ఈ ప్రకృతి విపత్తు వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ప్రభాస్ నుంచి మొదలు పెడితే అనన్య నాగళ్ళ వరకు తమకు తోచిన విరాళం ప్రకటిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. సినీ పరిశ్రమలో చాలామంది ఇంతవరకు స్పందించలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. సమాజం నుంచి ఎంతో తీసుకున్న సినిమా రంగానికి చెందిన వారు ఇలాంటి కష్ట కాలంలో ఆదుకునేందుకు ముందుకు రాక పోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
1986 వరదల సమయంలో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1986లో భారీగా వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు స్పందించారు. నాటి వరదల్లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్రంగా నష్టం చోటుచేసుకుంది. 250 మంది చనిపోయారు. లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయి. ఆ సమయంలో సినిమా పరిశ్రమ కదిలి వచ్చింది. భారీగా విరాళాలు ఇచ్చింది. విరాళాలు భారీగా ఇచ్చిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ లక్ష, రెబల్ స్టార్ కృష్ణంరాజు 1.5 లక్షలు, బాలకృష్ణ 2.5 లక్షలు, దాసరి నారాయణరావు లక్ష, రామానాయుడు 50,000, చిరంజీవి 50,000, అక్కినేని నాగేశ్వరరావు 25,000, అశ్విని దత్ 10,000, విక్రమ్ చిత్ర యూనిట్ రెండున్నర లక్షలు, బాలీవుడ్ హీరోలు జితేంద్ర, రాజేష్ ఖన్నా చెరో లక్ష, రజనీకాంత్ కమలహాసన్ తల 50 వేలు, కమెడియన్ నగేష్ 10,000 ఇచ్చి తమ ఉదార మనసును చాటుకున్నారు.
హీరోయిన్లలో..
హీరోయిన్లలో శ్రీదేవి, జయప్రద, జయసుధ తలా 50 వేలు ఇచ్చారు, విజయశాంతి, మాధవి, సుజాత 10,000 ఇచ్చారు. సిల్క్ స్మిత, జయమాలిని చెరో 5,000 ఇచ్చారు. గాయని సుశీల 10,000 ఇచ్చారు. మరో గాయని శైలజ 5,000 ఇచ్చారు.. అయితే నాడు ఇండస్ట్రీలో ఐక్యత ఉండేది. ప్రస్తుతం అది కొరవడింది. అందువల్లే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా.. సినీ చిత్ర పరిశ్రమలో పరిస్థితి ఉంది. ఒకవేళ నాటి ఐక్యత ఇప్పుడు ఉండి ఉంటే సమాజానికి చిత్ర పరిశ్రమ నుంచి మరింత సహకారం లభించేది. ఈ కష్టకాలంలో అది వరద బాధితులకు మరింతగా ఉపకరించేది. ఇప్పటికైనా సినిమా పరిశ్రమకు చెందినవారు ఒక్క తాటిపైకి వచ్చి.. రెండు తెలుగు రాష్ట్రాలను ఆదుకోవాలని వారి అభిమానులు కోరుతున్నారు.