Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు( ambati Rambabu) జగన్ పట్ల మరోసారి విధేయతను చాటుకున్నారు. తనకు జగన్ మాట శిరోధార్యం అని తేల్చి చెప్పారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి అంబటి రాంబాబును తొలగించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో మరో వ్యక్తికి అవకాశం ఇచ్చారు జగన్. అంబటి రాంబాబుకు గుంటూరు పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది పొమ్మన లేక పొగ పెట్టడమే. మరో నాయకుడు అయితే పార్టీతో పాటు అధినేత తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు. కానీ అంబటి అలా కాదు. తనకు జగన్ మాటే వేదవాక్కు అని.. ఈ విషయంలో తనకు ఎలాంటి ఆగ్రహం లేదని తేల్చి చెప్పారు. సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో సమావేశం అయ్యారు. సత్తెనపల్లి నియోజకవర్గాన్ని విడిచి పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జగన్ పట్ల విధేయత చూపారే కానీ.. అనుచిత కామెంట్స్ చేయలేదు.
* సుదీర్ఘ రాజకీయ నేపథ్యం
గుంటూరు జిల్లాలో( Guntur district) అంబటి రాంబాబు ది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. అయితే ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది రెండుసార్లు మాత్రమే. 1989లో గెలిచిన ఆయన… మూడు దశాబ్దాల తర్వాత 2019లో గెలిచారు. అందుకే జగన్ ఆయనను పిలిచి మరి మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆది నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే అంబటి రాంబాబుకు ఎనలేని గౌరవం. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారు. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జగన్ వెంట అడుగులు వేసిన ఒకే ఒక నాయకుడు అంబటి రాంబాబు. అసలు జగన్ నిలబడగలడా? లేడా అని కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చేందుకు నేతలు సంశయించేవారు. ఆ సమయంలో మరో మాటకు తావు లేకుండా అండగా నిలిచింది మాత్రం అంబటి రాంబాబు.
* మూడుసార్లు సత్తెనపల్లి నుంచి
2014లో సత్తెనపల్లి( sattenapalle ) నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు జగన్. ఆ ఎన్నికల్లో వెయ్యిలోపు ఓట్ల తేడాతోనే ఓటమి చవి చూశారు అంబటి రాంబాబు. కోడెల శివప్రసాదరావు ఎమ్మెల్యేగా ఎన్నికై స్పీకర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019లో మాత్రం అదే కోడెల శివప్రసాదరావును 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో 27 వేల ఓట్లకు పైగా తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది అంబటి రాంబాబు. అయితే జగన్కు అత్యంత విధేయుడుగా ఉన్న అంబటి రాంబాబును తప్పించడం ఆయన అభిమానులను, అనుచరులకు రుచించడం లేదు.
* తొలిసారిగా రేపల్లె నుంచి
తొలిసారిగా రేపల్లె( repalle ) నుంచి 1989 ఎన్నికల్లో గెలిచారు అంబటి రాంబాబు. నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డితో అసెంబ్లీలో గడిపే అవకాశం వచ్చిందని చెబుతుంటారు. మరోవైపు జగన్ తనకు మూడుసార్లు సత్తెనపల్లి నియోజకవర్గంలో అవకాశం ఇచ్చారని.. ఆయన ఇప్పుడు ఇన్చార్జి పదవిని వదులుకోమన్నారని.. ఆయన ఆదేశాలే తనకు శిరోధార్యం అంటూ.. సత్తెనపల్లి వైసీపీ శ్రేణులకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం అంబటి రాంబాబు గుంటూరు జిల్లా వైసిపి అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే అంబటిని తెరవెనుక రాజకీయాలకే పరిమితం కావాలని జగన్ ఆదేశించినట్లు ప్రచారం నడుస్తోంది. అంటే ఇక్కడ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో అంబటి రాంబాబు పోటీ చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అయితే దీనిపై అంబటి రాంబాబు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.