Former mines MD Venkat Reddy Arrested : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మద్యం,ఇసుక మాఫియా బరితెగించిందని..వేలకోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వీటిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పుకొచ్చారు.ముఖ్యంగా గనుల శాఖలో భారీ గలీజు వ్యవహారం నడిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైసిపి హయాంలో గనుల శాఖ ఎండిగా వ్యవహరించిన వెంకటరెడ్డి అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారన్న కామెంట్స్ వినిపించాయి. అప్పట్లో సీఎం జగన్ కు సైతం తప్పుదోవ పట్టించారని ఈయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. కేవలం జగనన్న భూ సర్వే కు సంబంధించి..సర్వే రాళ్ల కాంట్రాక్టు లోనే 300 కోట్ల రూపాయలు దోచేశారన్న ఆరోపణలు వెంకటరెడ్డి పై ఉన్నాయి.అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటరెడ్డి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.గనుల శాఖలో లీజు అక్రమాలు,అక్రమ ఇసుక తవ్వకాలకు వెంకటరెడ్డి పూర్తిగా సహకరించారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో వెంకటరెడ్డిని ఏ1 గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.ఈ కేసులో మొత్తం ఏడుగురిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే అప్పటినుంచి వెంకటరెడ్డి అజ్ఞాతంలో ఉన్నాడు.ఆయన కోసం తిరుపతి,విజయవాడ,హైదరాబాద్,బెంగళూరు,ముంబై,చెన్నై,ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు గాలించారు.వెంకట్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.
* హైదరాబాదులోనే పట్టుబడిన వైనం
అయితే వెంకటరెడ్డి హైదరాబాదులోనే తలదాచుకుంటున్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం వచ్చింది.పక్క సమాచారం మేరకు గురువారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.శుక్రవారం ఉదయం విజయవాడలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకురానున్నారు.అక్కడ విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో మిగిలిన ఏడుగురు నిందితులను సైతం విచారించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
* ప్రభుత్వ పెద్దలకు వీర విధేయుడు
వెంకటరెడ్డి అప్పటి ప్రభుత్వ పెద్దలకు వీర విధేయుడుగా ఉండేవారని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా అప్పటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు వినేవాడని వెంకటరెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి.భారీగా దోపిడీకి పాల్పడ్డారని సహచర అధికారులే అంతర్గత సమావేశాల్లో చెప్పుకొచ్చేవారు. కేవలం దోపిడీ కోసమే వెంకటరెడ్డిని గనుల శాఖ ఎండిగా పదోన్నతి కల్పించాలని కూడా ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక కాంట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేయడానికి వెంకటరెడ్డి పూర్తిగా సహకరించాడని ఏసీబీ దర్యాప్తులో తేలింది. వెంకటరెడ్డి నిర్లక్ష్యం కారణంగా సుమారు 2500 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని కూడా తెలుస్తోంది. ఈ ఆరోపణల చుట్టూనే ఏసీబీ దర్యాప్తు కొనసాగినట్లు సమాచారం.
* మిగతా వారిలో అలజడి
గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డి అరెస్టు మిగతా వారిలో కూడా అలజడి ప్రారంభమైంది. ఆయనకు కస్టడీలోకి తీసుకొని అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంపై కూడా ఏసీబీ ఆరా తీయనున్నట్లు సమాచారం.వెంకటరెడ్డి అరెస్టుతో.. నాటి ప్రభుత్వ పెద్దలు సైతం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు వినిపిస్తోంది.గత కొద్దిరోజులుగా ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఒకవేళ వెంకట్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.