TTD Chairman : టీటీడీ చైర్మన్ గా అనూహ్య వ్యక్తి తెరపైకి వచ్చారా? ఆయనకు పదవి దక్కడం దాదాపు ఖాయమైందా? చంద్రబాబు సైతం సుముఖంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రభుత్వాలు మారినప్పుడు టీటీడీ చైర్మన్ పదవి మారడంఆనవాయితీగా వస్తోంది.ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురయింది. ఆ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉండేవారు. అంతకుముందు వైవి సుబ్బారెడ్డి వ్యవహరించేవారు. దీంతో అన్ని పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తున్నారని ప్రచారం జరిగింది. దీంతో ఎన్నికలకు ముందు బీసీ నేతకు ఆ పదవి కట్టబెడతారని ప్రచారం జరిగింది. కానీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కరుణాకర్ రెడ్డికి ఆ పదవి ఇచ్చారు జగన్. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆ పదవికి రాజీనామా చేశారు కరుణాకర్ రెడ్డి. గత రెండు నెలలుగా టీటీడీ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. సాధారణంగా టిటిడి చైర్మన్ అంటే మంత్రి పదవితో సమానం. జాతీయస్థాయి ప్రజాప్రతినిధులు వచ్చేటప్పుడు తప్పకుండా ప్రోటోకాల్ ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. రాజకీయాలతో సంబంధం లేని వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే టీటీడీ అధ్యక్ష పదవి కీలకం కావడంతో సొంత పార్టీ, నమ్మకమైన నేతలను నియమించుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం టిటిడి అధ్యక్ష పదవి భర్తీ చేయడానికి కసరత్తు చేస్తోంది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం కావడంతో సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ తో కలిపి కసరత్తు జరుపుతున్నారు.
* తెరపైకి చాలా పేర్లు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ అధ్యక్షుడిగా మెగా బ్రదర్ నాగబాబు పేరు వినిపించింది. తప్పకుండా ఆయనకు చాన్స్ ఇస్తారని అంతా భావించారు. ఈ ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి గెలుపునకు నాగబాబు కృషి చేశారు. ఎక్కడా పోటీ చేయలేదు కూడా. అనకాపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. కూటమి ధర్మం నేపథ్యంలో బిజెపికి ఆ సీటును కేటాయించారు. దీంతో నాగబాబుకు ఎక్కడా పోటీ చేసే ఛాన్స్ దక్కలేదు. దీంతో టీటీడీ అధ్యక్ష పదవి ఇస్తారని ప్రచారం ప్రారంభమైంది. అటువంటిదేమీ లేదని నాగబాబు తోసి పుచ్చడంతో ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
* వారందరి పేర్లు వినిపించినా
తరువాత టిటిడి అధ్యక్ష పదవి విషయంలో రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మురళీమోహన్, టీవీ5 అధినేత బిఆర్ నాయుడు వంటి పేర్లు వినిపించాయి. గౌరవప్రదంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. టిటిడి అధ్యక్ష పదవి ఇవ్వాలని మురళీమోహన్ చంద్రబాబును అడిగినట్లు వార్తలు వచ్చాయి. అశోక్ మాత్రం సుముఖంగా లేరని.. ఆయన గవర్నర్ పదవి ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే చివరికి బిఆర్ నాయుడు వైపు చంద్రబాబు మొగ్గు చూపినట్లు బలమైన ప్రచారం జరిగింది. ఇక ప్రకటనే తరువాయి అన్నట్టు టాక్ నడిచింది.
* మాజీ న్యాయమూర్తి కి గౌరవం
అయితే ఇప్పుడు అనూహ్యంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన చంద్రబాబుకు సన్నిహితుడు అన్న పేరు ఉంది. అప్పట్లో టిడిపి లీగల్ సెల్ కు ఆయన సేవలు అందించారు. తరువాత జడ్జిగా నియమితులు కావడంతో రాజకీయాలకు దూరమయ్యారు. ఒకానొక దశలో జగన్ సైతంఎన్వి రమణ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పేరును కొలీజియం సిఫారసు చేసినప్పుడు ఏకంగా కేంద్రానికి లేఖ రాశారు. అప్పట్లో అదో సంచలనం. ఇటీవల పదవీ విరమణ చేసిన ఎన్వి రమణ శేష జీవితం గడుపుతున్నారు. అటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే సముచితంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో టీటీడీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.