https://oktelugu.com/

Tirupathi  : జగన్ రాకతో ప్రకృతికి వినాశనమేనా? ఏంటి దారుణం?

ఈ నెల 21న తిరుపతి జిల్లా వెంకటగిరిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. నేతన్నహస్తం కింద బటన్ నొక్కేందుకు రానున్నారు. దీంతో వెంకటగిరిలో పచ్చని చెట్లపై రంపపు వేటు వేశారు. త్రిభువ‌ని కూడ‌లి ప్రాంతంలో చెట్ల‌ను పూర్తిగా తొల‌గించారు.

Written By: Dharma, Updated On : July 20, 2023 6:35 pm
Follow us on

Tirupathi  : వెంకటేష్ సూపర్ హిట్ చిత్రం చంటి గుర్తుంది కదూ..అందులో జమిందారు బిడ్డ అయిన మీనా బయటకు వస్తే ఊర్లో ఉండే మగవారంతా తలలు దించుకోవాలి. లేకుంటే శిరోముండనమే. ఇప్పుడు ఏపీలో అటువంటి నిబంధన ఒకటి నడుస్తోంది. కానీ మనుషులకు కాస్తా మినహాయింపు ఇచ్చారు. నోరులేని చెట్లకు, మాటరాని నిర్మాణాలకు వర్తింపజేశారు. ఇంతకీ ఇది ఎవరి విషయంలో తెలుసా? సీఎం జగన్. ఆయన జిల్లాల పర్యటనకు వస్తున్నారంటే.. ఆయన వెళ్లే మార్గాల్లో పచ్చని చెట్లను మటు మాయం చేస్తున్నారు. డివైడర్లు వంటి నిర్మాణాలను తొలగిస్తున్నారు.

ఈ నెల 21న తిరుపతి జిల్లా వెంకటగిరిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. నేతన్నహస్తం కింద బటన్ నొక్కేందుకు రానున్నారు. దీంతో వెంకటగిరిలో పచ్చని చెట్లపై రంపపు వేటు వేశారు. త్రిభువ‌ని కూడ‌లి ప్రాంతంలో చెట్ల‌ను పూర్తిగా తొల‌గించారు. అలాగే స‌చివాల‌యం స‌మీపంలో ఉన్న కానుగ చెట్ల‌ను కూక‌టి వేళ్ల‌తో స‌హా పెక‌లించారు. అలాగే వెంక‌ట‌గిరి రోడ్ల‌పై ఉన్న చెట్ల‌ను కూడా తొల‌గించిన‌ట్టు తెలుస్తోంది. ఇలా తొలగించిన చెట్లను రోడ్డు డివైడర్ల మధ్య పెట్టారు. దీంతో ప్రజలు వాటిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మొక్కను పెంచి చెట్టుగా మార్చాలంటే ఎంత కష్టపడాలో తెలుసా అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.

సాధారణంగా ప్రముఖులు ఒక ప్రాంతంలో పర్యటించినప్పుడు గుర్తుగా మొక్కలు నాటడం చూసుంటాం. కానీ సీఎం జగన్ విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. మొక్కలు నాటాల్సింది పోయి.. చెట్లను తొలగిస్తున్నారు.గతంలో చాలామంది సీఎంలు ఈ రాష్ట్రాన్ని పాలించారు. కానీ ఎవరి హయాంలో లేని నీచ సంస్కృతి జగన్ ప్రవేశపెట్టడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఇలా చెట్ల తొలగింపు మొదటిసారి కాదు. గత నాలుగేళ్లుగా చేస్తూనే ఉన్నారు. విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ దిద్దుబాటు చర్యలకు మాత్రం చేపట్టడం లేదు.

ఇలా చెట్లు తొలగించుకుంటూ పోతుండడంతో సీఎం జగన్ పై కొత్త సెటైర్లు పడుతున్నాయి. సీఎం రాష్ట్రమంతా పర్యటిస్తే చెట్లు లేకుండా చేస్తారని ఎక్కువ మంది విమర్శలు కురిపిస్తున్నారు. జగన్ రాకకు చెట్లు నరికివేతకు అస్సలు ఏం సంబంధమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గంటల పాటు పర్యటనలకు దశబ్దాల చరిత్ర కలిగిన చెట్లను నరకడం భావ్యమా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. జగన్ తాడేపల్లి దాటి రావద్దన్న విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి.