Ashok Gajapati Raju : టీడీపీ ఆవిర్భావం నుంచి విజయనగరం జిల్లా ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. అశోక్ గజపతిరాజు రూపంలో స్ట్రాంగ్ లీడర్ దొరకడంతో అక్కడ అన్నీ ఆయనే. మెజార్టీ సామాజికవర్గం తూర్పుకాపులు ఉన్నా క్షత్రియ సామాజికవర్గానికి చెందిన రాజుకే టీడీపీ హైకమాండ్ టాప్ ప్రయారిటీ ఇస్తోంది. బహుశా దీనినే గుర్తించిన రాజశేఖర్ రెడ్డి పెనుమత్స సాంబశివరాజును కాదని.. ఆయన శిష్యుడు, తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన బొత్స సత్యనారాయణకు తెరపైకి తెచ్చారు. అప్పటి నుంచి కాంగ్రెస్, ఆ తరువాత వైసీపీ జెడ్ స్పీడ్ లో సాగేందుకు నాటి వైఎస్ నిర్ణయమే కారణమైంది. గత ఎన్నికల్లో జిల్లాలో తొమ్మిది స్థానాలను వైసీపీ స్వీప్ చేసింది. దీంతో ఎంపీగా పోటీచేసిన అశోక్ గజపతిరాజుతో పాటు తొమ్మిది నియోజకవర్గాల్లో టీడీపీకి ఓటమే ఎదురైంది.
జిల్లాలో తూర్పుకాపు, వెలమ సామాజికవర్గాలు ఉన్నా అశోక్ గజపతిరాజును జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారు. దానికి కారణం రాజుగారికి ఉన్న క్లీన్ ఇమేజే. అయితే తినరు.. పనిచేయరు అన్న అపవాదు ఆయనపై ఉంది. అయితే రాజుగారికి ఇవే చివరి ఎన్నికలు ఆయన వయసు ఏడున్నర పదులు దాటుతోంది. అందుకే ఈసారి రాజుగారి సేవలను సరిగ్గా వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. విజయనగరం ఎంపీ సీటుతో పాటు ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలను కైవసం చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. పక్కా వ్యూహాలను రూపొందిస్తున్నారు.
ఇటీవల అశోక్ గజపతిరాజును మంగళగిరి పార్టీ కార్యాలయంలోకి పిలిపించుకున్న చంద్రబాబు జిల్లాలో పార్టీ స్థితిగతులపై చర్చించారు. రాజుగారి మనసులో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తారా? ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారా? అని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ రాజుగారి దీనిపై క్లారిటీ ఇవ్వలేకపోయారు. అయితే అశోక్ గజపతిరాజు అంతర్గత సమావేశాల్లో మాత్రం తనకు ఎంపీగా పోటీచేయాలని ఉందని అనుచరుల వద్ద చెబుతున్నారు. ఓడిపోయిన చోట గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నట్టు సమాచారం.
అయితే చంద్రబాబు మాత్రం అశోక్ ను విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి పోటీచేయించాలని చూస్తున్నారు. ఎంపీగా తూర్పుకాపు క్యాండిడేట్ ను బరిలో దించితే విజయం సునాయాసం అవుతుందని.. లోక్ సభ స్థానం పరిధిలో ప్రభావం చూపినట్టవుతుందని భావిస్తున్నారు. పైగా రేపు అధికారంలోకి వస్తే మంత్రి పదవుల కోసం పోటీ ఉండదని.. ఇదే లాస్ట్ చాన్స్ కావడంతో అశోక్ ను మంత్రి చేస్తే మిగతా వాళ్లు అడ్డుచెప్పరన్నది బాబు ప్లాన్. అయితే రాజుగారు మాత్రం తాను ఎక్కడ ఓడిపోయారో అక్కడే వెతుక్కునే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు.