Jagan Narsipatnam: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) షాక్ ఇచ్చారు దళిత సంఘాల నేతలు. ఆయన నర్సీపట్నంలో అడుగుపెట్టక ముందే.. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా భారీగా ఫ్లెక్సీలు వెలిసాయి. ఇప్పుడు అవే వైరల్ అంశంగా మారాయి. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల పరిశీలనకు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వస్తున్న సంగతి తెలిసిందే. శాంతి భద్రతల కారణాల దృష్ట్యా.. తొలుత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పర్మిషన్ ఇవ్వలేదు విశాఖ పోలీసులు. రోడ్డు మార్గం గుండా పర్యటనకు వెళ్లే వీలులేదని.. హెలికాప్టర్లో వెళ్లాలని సూచించారు. దీనిపై అనేక రకాల విమర్శలు రావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఈరోజు జగన్ నర్సీపట్నం వెళ్ళనున్నారు. కానీ జగన్ నర్సీపట్నంలో అడుగు పెట్టక ముందే ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కనిపించడం విశేషం.
* దళిత సంఘాల హెచ్చరిక..
జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం( Narsipatnam) పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు ముందస్తుగానే హెచ్చరించాయి. వైసిపి హయాంలో డాక్టర్ సుధాకర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి డాక్టర్ సుధాకర్ ను వైసిపి ప్రభుత్వమే హత్య చేయించిందన్న ఆరోపణలు వచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో దళితులు వ్యతిరేకం కావడానికి డాక్టర్ సుధాకర్ మరణం కూడా ఒక కారణమే. కోవిడ్ సమయంలో మాస్కులు, శానిటైజర్లు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ వైద్యాధికారిగా ఉన్న సుధాకర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనిని సహించలేని ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. నడిరోడ్డుపై పోలీసులు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పట్లో సుధాకర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మరణం పై దర్యాప్తు చేయాలని అప్పట్లో దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
* భారీగా ఫ్లెక్సీలు..
తాజాగా మెడికల్ కాలేజీల( medical colleges ) సందర్శనకు జగన్ నర్సీపట్నం వస్తుండడంతో దళిత సంఘాలు స్పందించాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో నర్సీపట్నం వ్యాప్తంగా డాక్టర్ సుధాకర్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు వెలిసాయి. మాస్కు ఇవ్వలేక హత్యలు చేసిన వాళ్లు మెడికల్ కాలేజీ ల గురించి మాట్లాడడమా? ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని ఫ్లెక్సీల పై రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.